KCR | హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అమెరికాలోని డల్లాస్లో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం కావడంలో కీలక భూమికను పోషించినందుకు మహేశ్ బిగాలను కేసీఆర్ అభినందించారు. పార్టీ రజతోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న బీఆర్ఎస్ ఎన్నారై శాఖలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ విజయవంతంపై ఆనందం వ్యక్తం చేస్తూ, మహేష్ బిగాలను ప్రత్యేకంగా అభినందించారు. సుదూర అమెరికాలో దేశభక్తితో, పార్టీ పట్ల అపారమైన అంకితభావంతో ఇంత భారీ సభను విజయవంతంగా నిర్వహించడం గొప్ప విషయం. ఇది మీ త్యాగానికి, సమర్పణకు నిదర్శనం. విదేశాల్లో ఉన్న మన ఎన్నారైలు ఇప్పుడు బీఆర్ఎస్ ఆశయాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారారని కేసీఆర్ అన్నారు.
మహేష్ బిగాల మాట్లాడుతూ.. డల్లాస్ సభను చూసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారై బీఆర్ఎస్ శ్రేణుల్లో విపరీతమైన ఉత్సాహం నెలకొంది. ఇప్పటికే దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, లండన్ వంటి దేశాలు రజతోత్సవ సభలు నిర్వహించేందుకు తమ ఆసక్తిని తెలియజేశాయని వెల్లడించారు.
డాక్టర్ పెప్పర్ అరేనా, డల్లాస్ వేదికగా జూన్ 16న జరిగిన ఈ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై, అమెరికాలోని వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన వేలాది మంది తెలుగు ప్రజల్ని ఉద్దేశించి ఉద్వేగంగా ప్రసంగించారు. కేటీఆర్ ప్రసంగం రాజకీయ ఉపన్యాస శైలికి భిన్నంగా సాగి అందరి మనసులను గెలుచుకుంది. తెలంగాణ నైపుణ్యం, భవిష్యత్తు సవాళ్లపై లోతుగా విశ్లేషించిన ఆయన మాటలు దేశదేశాల్లోని తెలంగాణవాసుల హృదయాలను తాకాయి. ఈ సభ ఒక్క సంబురమే కాదు.. అది బీఆర్ఎస్ గ్లోబల్ ఉద్యమానికి సత్సంకల్పం ఇచ్చిందన్నారు.
కేసీఆర్ మహేష్ బిగాల, మహేష్ తన్నీరు, యూఎస్ఏ బీఆర్ఎస్ నాయకుల కృషిని అభినందిస్తూ, సభ విజయవంతంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సభ బీఆర్ఎస్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రయాణం కదం తొక్కుతూ.. పదం పాడుతూ.. హృదయాంతరాల్లోంచి గర్జిస్తూ సాగిన గౌరవయాత్ర. ఈ ఉద్యమాన్ని ఇప్పుడు అంతర్జాతీయ మట్టానికి తీసుకెళ్లే బాధ్యత ఎన్నారై శ్రేణులదే అని మహేష్ బిగాల పేర్కొన్నారు.