జూపల్లి రమేశ్ రావు/నిజామాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా పురుడు పోసుకున్న తెలంగాణ రాష్ట్ర సమితి గమ్యాన్ని దాటుకుని ఇప్పుడు సరికొత్త లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నది. 2001 ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు తెలంగాణలో కంచుకోటగా మారిన గులాబీ పార్టీ ఇప్పుడు కారు జోరును మహారాష్ట్రలోనూ చూపించేందుకు సిద్ధమవుతున్నది. బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తర్వాత తొలిసారిగా పక్క రాష్ట్రంలో సమావేశం నిర్వహించబోతున్నది. తెలంగాణకు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలోని నాం దేడ్ జిల్లా కేంద్రంలో గులాబీ అధినేత కేసీఆర్ సమావేశం చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టబోతున్నది. మరాఠ్వాడాలో గులాబీ జెండా సృష్టించబోతున్న సంచలనం కోసం ప్రజలంతా వేయి కండ్లతో ఎదురు చూస్తున్నారు. అయితే మహారాష్ట్రలో కేసీఆర్ అడుగు పెట్ట డం ఇది కొత్తేమీ కాదు. ఉద్యమ కాలంలో ఢిల్లీ కి చేపట్టిన కార్ల ర్యాలీ ద్వారా రెండు దశాబ్దాల క్రితమే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో కేసీఆర్ చరిత్ర సృష్టించారు. ఇప్పుడు దేశ రాజకీయ గతిని మార్చే క్రమంలో మరోమారు అడుగు పెట్టబోతుండటం ప్రాధాన్యం సంతరించుకొన్నది. అందుకే అప్పుడు నాగ్‌పూర్.. ఇప్పుడు నాందేడ్ అన్నట్టుగా మారింది.
అప్పుడు నాగ్‌పూర్
తెలంగాణ ఉద్యమ చరిత్రలో 2003, మార్చి 27 సువర్ణాక్షరంతో లిఖించబడింది. ఉద్యమ నేతగా కేసీఆర్ ఆనాడు ఫలక్‌నుమా ప్యాలెస్ నుంచి దేశ రాజధాని ఢిల్లీకి కారు ర్యాలీని తలపెట్టారు. ఈ ర్యాలీ హైదరాబాద్ నుంచి 100 కార్లతోనే మొదలవ్వగా దారి పొడవునా ప్రజలంతా తమ సొంత వాహనాలతో కేసీఆర్‌కు జేజేలు పలుకుతూ కదం తొక్కారు. అలా ఢిల్లీ బాటలో భారీ వాహన శ్రేణితో కేసీఆర్ ప్రత్యేకంగా వైర్లెస్ సెట్లో అందరినీ సమన్వయం చేసుకొంటూ ముందు కు సాగారు. ఈ అపురూప ఘట్టంలో మొదటి రోజు పెన్‌గంగ నదీ తీరంలో కేసీఆర్ బస చేశారు. మరునాడు మహారాష్ట్రలోని విదర్భ నుంచి బయల్దేరగా నాగ్‌పుర్‌లో వేల మంది కేసీఆర్‌కు జిందాబాద్ కొడుతూ స్వాగతం పలికారు. సరిగ్గా రెండు దశాబ్దాల తర్వాత అదే మరాఠా గడ్డపై కేసీఆర్ సమావేశం ద్వారా ప్రజల్లోకి వస్తుండటం విశేషం. ఉద్యమ సమయంలో నాగ్‌పూర్ ప్రజల ఆశీర్వాదం ఫలించగా, ఇప్పుడు దేశం కోసం సీఎం కేసీఆర్ తమ గడ్డపై తలపెట్టిన మహత్కార్యం సిద్ధిస్తుందని నాందేడ్ ప్రజలు అంటున్నారు.
అబ్కీ బార్ కిసాన్ సర్కార్
తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడు ఎదుర్కొన్న సమస్యలు, సవాళ్లు అచ్చంగా ఇప్పుడూ వివిధ రూపాల్లో దేశం ఎదుర్కొంటున్నవే. తెలంగాణలో ఆ సమస్యలను సంక్షేమంతో రూపుమాపారు. ఇప్పుడు ఆ పథకాలే ఆయనకు అస్ర్తాలుగా మారాయి. అబ్కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశ ప్రజల్లోకి వెళ్తున్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ప్రాజెక్టులు, పింఛన్లు, కులవృత్తులకు ప్రోత్సాహకాలు, డబుల్ బెడ్రూం ఇండ్లు, విదేశీ విద్యకు సహకారం ఇలా ఒకటేమిటి అనేక పథకాలతో పొరుగు రాష్ర్టాల్లో కేసీఆర్‌కు ఏర్పడిన క్రేజ్ అంతా ఇంతా కాదు.
బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో..
ఎనిమిదేండ్లుగా దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నది. మోదీ సర్కారు ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అడ్డుకోవడంలో కాంగ్రెస్, ఇతర పార్టీలు విఫలమయ్యాయి. కేవలం తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక్కరే మోదీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నోరు విప్పి గర్జిస్తున్నారు. ప్రజల మద్దతుతో బీజేపీ ముక్త్ భారత్ నినాదంతో ఇప్పుడు మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టి బయల్దేరారు. దేశ భౌగోళిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులపై సంపూర్ణ అవగాహన కలిగిన కేసీఆర్ వంటి నాయకుడు జాతీయ రాజకీయాల్లో రావడం చారిత్రక అవసరంగా కనిస్తున్నది. 2003 నాటి నాగ్‌పుర్ ఘట్టం టీఆర్ఎస్ చరిత్ర పుటల్లో చేరినట్టే, నాందేడ్ సమావేశం సైతం బీఆర్ఎస్ ప్రస్థానంలో చిరస్థాయిగా నిలవబోతున్నది.