నల్లగొండ, అక్టోబర్ 23 : ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రామన్నపేటలో అదానీ గ్రూప్ చేపడుతున్న అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణంపై మంత్రుల వైఖరి తెలియజేయాలని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ డిమాండ్ చేశారు. నల్లగొండలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నోముల భగత్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ప్రజాభిప్రాయానికి మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యేలుగా మమ్మల్ని హాజరుకానివ్వకుండా అరెస్ట్ చేయించటంలో కుట్ర ఏందో చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ నేతలను గృహ నిర్బంధం చేసి, పోలీసుల పహారాలో ప్రజాభిప్రాయ సేకరణ చేయటం ఏమిటని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ ఆధ్వర్యం లో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీని అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు చెరుకు సుధాకర్ గౌడ్, మందడి సైదిరెడ్డి, బోనగిరి దేవేందర్, రావుల శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పొలాలను నాశనం చేస్తే ఊరుకోం
నకిరేకల్ నియోజకవర్గంలోని 12 గ్రామాల్లో పచ్చని పంట పొలాలను నాశనం చేస్తామంటే ఉపేక్షించేది లేదు. ప్రజాభిప్రాయ సేకరణ పోలీసుల మధ్య పెట్టడం ఎందుకు ? రామన్నపేట నాశనం కాకుండా ఉండాలంటే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వెంటనే స్పందించాలి.
– చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే
కోమటిరెడ్డి బ్రదర్స్ వైఖరేంది?
డ్రైపోర్ట్ పేరుతో భూసేకరణ చేసి ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టి ప్రజల నోట్లో దుమ్ము కొట్టే ప్రయత్నం అదానీ చేస్తున్నాడు. దీనిపై కోమటిరెడ్డి బ్రదర్స్ తమ వైఖరి చెప్పాలి. మోదీ కనుసన్నల్లో అదానీ హైదరాబాద్‌కు వస్తుంటే రేవంత్ స్వాగతం పలుకుతున్నాడు. రామన్నపేటలో జనం వద్దని గగ్గోలు పెడుతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికి పోయారు ?
– కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
కోదండరాం,హరగోపాల్ స్పందించాలి
సిమెంట్ ఫ్యాక్టరీ వద్దని ప్రజలు వ్యతిరేకిస్తున్నా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎందుకు హాజరు కాలేదు? ప్రజలకు ఇష్టంలేని ప్రాజెక్టుపై ప్రొఫెసర్ హరగోపాల్, కోదండరామ్ ఎందుకు స్పందించటం లేదు? ప్రస్తుతం రేవంత్ రెడ్డిని రాష్ట్రంలో తిట్టని వాళ్లే లేరు. సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల జరిగే నష్టం మండలి చైర్మన్ గుత్తాకు తెల్వదా? దానిపై ఎందుకు మాట్లాడటం లేదు ? చీకటి ఒప్పందాలతో ముందుకు సాగుతున్న బీజేపీ, కాంగ్రెస్‌లకు బీఆర్ఎస్సే కళ్లెం వేస్తుంది.
– గాదరి కిశోర్ కుమార్, మాజీ ఎమ్మెల్యే, తుంగతుర్తి