హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): కోమటిరెడ్డి వెంకట్రెడ్డీ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కనీవినీ ఎరుగనీ రీతిలో కేసీఆర్ పదేండ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి పనులు కనిపిస్తలేదా? సంక్షేమ పథకాలు నీ దృష్టిలో పడతలేదా? మా బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో, ఏడాది మీ కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చర్చిద్దామా? అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి బీఆర్ఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ముఖ్య నేతలు సవాల్ విసిరారు. నల్లగొండ జిల్లాకు కేసీఆర్ ఏమీ చేయలేదని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అనడంపై వారంతా భగ్గుమన్నారు.
ఉమ్మడి జిల్లాలో పెరిగిన సాగు అయకట్టు, సంక్షేమ పథకాలు, మెడికల్ కాలేజీలు, నూతన కలెక్టరేట్ భవనాలు మీ కంటికి కనిపించడం లేదా? అని నిలదీశారు. కోమటిరెడ్డికి పదేండ్లలో జరిగిన అభివృద్ధి ఎలా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఎవరికీ అర్థంకాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆదివారం ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్, బూడిద భిక్షమయ్యగౌడ్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పార్టీ నేత చింతల వెంకటేశ్వర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
పదేండ్లలో కేసీఆర్ ఏమీ చేయలేదని వ్యాఖ్యానించడం కోమటిరెడ్డి దివాలాకోరుతనానికి నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ మండిపడ్డారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నల్లగొండ పట్టణంలో ఒక కొత్త రోడ్డయినా వేశావా? అని నిలదీశారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారాల నుంచి డబ్బు వసూలు తప్ప.. జిల్లా అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ మండిపడ్డారు. ఏడాదిలో కోమటిరెడ్డి జిల్లాకు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని, ఆయనతో తాము చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.
కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పచ్చి పొలిటికల్ బ్రోకర్, ఆయనను కాంగ్రెస్ పార్టీ ఎట్లా భరిస్తున్నదో అర్థం కావడం లేదని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తమ్ముడు రాజగోపాల్‌రెడ్డి కోసం బీజేపీకి ఓట్లేయమని వెంకట్‌రెడ్డి చెప్పింది నిజం కాదా? అని ప్రశ్నించారు. నాడు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తన దగ్గరకు రానివ్వకపోతే కోమటిరెడ్డి తెలంగాణ కోసమని దొంగ దీక్ష చేశారని బీఆర్ఎస్ నేత చింతల వెంకటేశ్వర్‌రెడ్డి విమర్శించారు. తెలంగాణలో కొత్త జిల్లాల కలెక్టరేట్లు ఉన్నట్టు.. ఇతర రాష్ట్రాల్లో సచివాలయాలు కూడా లేవని కోమటిరెడ్డి మెచ్చుకోలేదా? అని నిలదీశారు.
ఏండ్లుగా పట్టి పీడించిన ఫ్లోరైడ్ రక్కసి నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు బీఆర్ఎస్ పాలనలోనే విముక్తి లభించిందని ఎమ్మెల్సీ కోటిరెడ్డి గుర్తుచేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాడు కేసీఆర్ వ్యవసాయ, నీటిపారుదల రంగాలను కొత్త పుంతలు తొక్కించారని, కాళేశ్వరం ద్వారా సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాలకు సాగు, తాగునీటిని అందించారని చెప్పారు. అభివృద్ధే జరగలేదనడం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రాజకీయ అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అదనంగా 3 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వచ్చిందని మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్ వివరించారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, అన్నిరకాల మౌలిక వసతులు బీఆర్ఎస్ పాలనలోనే సమకూరాయని గుర్తుచేశారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులను తాము చేసినట్టు చెప్పుకోవడానికి ఇప్పటి మంత్రులకు సిగ్గుండాలని మండిపడ్డారు.