Bade Nagajyothi | ములుగు, సెప్టెంబర్ 1 (నమస్తేతెలంగాణ): తల్లి ప్రజాసేవలో తరిస్తుండగా, ఆమె రెండున్నరేండ్ల కొడుకు అంగన్వాడీలో విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నాడు. ములుగు జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి రాజకీయంగా బిజీబిజీగా ఉంటూ ములుగులో నివాసం ఉంటున్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ప్రస్తుతం బీఆర్ఎస్ ములుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపికయ్యారు. నాగజ్యోతి తన రెండున్నరేళ్ల కొడుకు గహన్ శివన్ ధ్రువన్ను ములుగులోని ఎస్టీ కాలనీలో ఉన్న అంగన్వాడీ సెంటర్లో 15 రోజుల క్రితం చేర్పించారు. ప్రతీ రోజు సెంటర్లో అందిస్తున్న పాలు, గుడ్లు, అన్నం, స్నాక్స్‌ను తీసుకుంటూ తోటి పిల్లలతో ధృవన్ విద్యాబుద్ధులు నేర్చుకుంటున్నాడు. నాగజ్యోతి అంగన్వాడీ సెంటర్లో తన కుమారుడిని వదిలి ప్రజాక్షేత్రంలో ముందుకు సాగుతున్న తీరుపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రభుత్వం ద్వారా నడుస్తున్న అంగన్వాడీ సెంటర్లలో కన్న ప్రేమ దొరుకుతుందనడానికి నాగజ్యోతి నిర్ణయమే నిదర్శనంగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఈ సెంటర్లో మొత్తం 10మంది చిన్నారులు ఉంటుండగా అంగన్వాడీ టీచర్ లక్ష్మీకాంతమ్మ, హెల్పర్ నాజియా వారి ఆలనాపాలన చూసుకుంటున్నారు. తోటి పిల్లలతో నాగజ్యోతి కుమారుడు చిట్టిపొట్టి మాటలతో ఆటలు ఆడుతున్నాడు. విషయం తెలుసుకున్న ‘నమస్తేతెలంగాణ’ సంబంధిత అంగన్వాడీ సెంటర్‌ను సందర్శించగా మొబైల్లో ఉన్న తన తల్లిదండ్రుల ఫొటోను చూసి మురిసిపోయాడు. నాగజ్యోతి సీఎం కేసీఆర్‌తో ఉన్న ఫొటోను చూసి ‘అమ్మ, కేసీఆర్ తాత’.. అంటూ ముఖ్యమంత్రిని గుర్తు పట్టాడు.