హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలన పట్ల రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, కేసీఆరే తిరిగి అధికారంలోకి రావాలని ప్రజ లు కోరుకొంటున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిసిన సందర్భంగా ఎంపీ రవిచంద్ర ఢిల్లీలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు ఇచ్చిన 432 హామీలను నెరవేర్చకపోవడం, అభివృద్ధి కుంటుపడిపోవడం, సంక్షేమ పథకాల అమలు నిలిచిపోవడంతో రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువత, ఉద్యోగులు, మహిళలు, దివ్యాంగులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 10 బిల్లులపై బీఆర్ఎస్ స్పష్టంగా మాట్లాడిందని చెప్పారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో చేసిన అభివృద్ధిని వివరించామని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, న్యాయమైన డిమాండ్లను కేంద్రం ముందుపెట్టామని తెలిపారు. హైదరాబాద్ ఎంఎంటీఎస్‌ను విస్తరించాల్సిన అవసరాన్ని కేంద్రం దృష్టికి తెచ్చామని వెల్లడించారు. వందేండ్ల చరిత్ర ఉన్న కొత్తగూడెం రైల్వేస్టేషన్‌ను డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని, రైల్వే లైన్‌ను భద్రాచలం మీదుగా ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల వరకు పొడిగించాలని డిమాండ్ చేశామని తెలిపారు. మామునూరు, ఆదిలాబాద్ విమానాశ్రయాల పనులను మరింత వేగవంతం చేయాలని, ప్రతిపాదిత కొత్తగూడెం, జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్టులకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని మంత్రి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడును కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు.
కాంగ్రెస్, బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. ప్రజలు ఎదుర్కొంటు న్న తక్షణ సమస్యలను పరిషరించడంలో, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన నిధుల ను రాబట్టడంలో, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించడంలో ఆ రెండు పార్టీల ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా, లేకున్నా తెలంగాణ ప్రజల గొంతును పార్లమెంట్ లోపల, బయట బలంగా వినిపిస్తున్నదని, న్యాయమైన డిమాండ్ల సాధనకు అలుపెరగని పోరాటం చేస్తున్నదని చెప్పారు.
రాజ్యసభలో గురువారం ‘గనులు, ఖనిజాలు (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు’పై జరిగిన చర్చలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడారు. గనుల రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించే సంసరణలకు మద్దతు ఇస్తున్నామని, అయితే సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తి దెబ్బతినకుండా రాష్ట్రాల ప్రయోజనాలను సమగ్రంగా రక్షించాలని స్పష్టం చేశారు. గనుల తవ్వకాల వల్ల తలెత్తే పర్యావరణ పరిరక్షణ, పునరావాసం, సామాజిక బాధ్యత వంటి భారాలను రాష్ట్రాలే భరిస్తున్నందున, వారి ఆదాయ హకులను కాపాడాలని సూచించారు. తాడిచర్ల బొగ్గు గనిని సింగరేణి సంస్థకు అప్పగించడం పట్ల ఎంపీ రవిచంద్ర సంతోషం వ్యక్తం చేస్తూ సభలో ఉన్న కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. కోయగూడెం, మణుగూరు, శ్రావణపల్లి బొగ్గు గనులను కూడా సింగరేణి సంస్థకే కేటాయించాలని కోరారు. పెట్టుబడుల ప్రోత్సాహం, పర్యావరణ పరిరక్షణ, ఖనిజ సంపద కలిగిన రాష్ట్రాల హకుల మధ్య సమతుల్యతను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ.. ఈ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తున్నదని ప్రకటించారు.
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, సహజవాయువు (వంటగ్యాస్) డీలర్లు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యలను పరిషరించాలని వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మధ్యాహ్నం పార్లమెంట్ ఆవరణలో పెట్రోలియం, సహజవాయువు శాఖల మంత్రి హర్దీప్సింగ్ పూరీని కలిసి వినతిపత్రం అందజేశారు.