హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): సమాజంలో ట్రాన్స్జెండర్లు ఎదురొంటున్న వివక్షను దూరం చేసి, వారికి స్వాభిమానం, గౌరవం కల్పించడమే లక్ష్యంగా చట్టాలు దోహదపడాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కోరారు. బుధవారం రాజ్యసభలో ‘ట్రాన్స్ జెండర్స్ హకులు-2026 సవరణ బిల్లు’పై జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా బిల్లులోని సానుకూల అంశాలను స్వాగతిస్తూనే, ప్రైవసీ, వ్యక్తిగత గుర్తింపు విషయాల్లో ఉన్న అభ్యంతరాలను సభ దృష్టికి తీసుకెళ్లారు. 2026 సవరణ బిల్లులో గుర్తింపు సర్టిఫికెట్ కోసం జిల్లా కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవడం, మెడికల్ బోర్డు సిఫార్సు తప్పనిసరి చేయడం వంటివి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని చెప్పారు. గతంలో విస్తృతంగా ఉన్న ‘ట్రాన్స్ జెండర్’ నిర్వచనాన్ని ఇప్పుడు కుదించడం వల్ల కొందరికి గుర్తింపు లభించకపోవచ్చని పేర్కొన్నారు. . తెలంగాణలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి పెద్దపీట వేశారని గుర్తుచేశారు.