MP Lingaiah Yadav | హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మండిపడ్డారు. నిరుద్యోగుల పేరిట కిషన్ రెడ్డి దొంగ దీక్ష చేస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో లింగయ్య యాదవ్ మీడియాతో మాట్లాడారు.
కేంద్రంలో ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. దేశంలో ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టిన చరిత్ర బీజేపీది అని లింగయ్య యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 1.40 లక్షల ఉద్యోగాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. నిరసన చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వంపై కాదు.. కేంద్రంపై చేయాలని సూచించారు.
కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణకు ఏం చేయలేదని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం ఏనాడూ పోరాటం చేయలేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే బీజేపీ కొత్తదారులు వెతుక్కుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో, రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషించే స్థాయిలో లేదన్నారు. గత ప్రభుత్వాలు హామీలు ఇచ్చి.. అమలు చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించే వ్యూహాన్ని అధినేత కేసీఆర్ నిర్ణయిస్తారని లింగయ్య యాదవ్ స్పష్టం చేశారు.