కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 20 : అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. శనివారం ఆయన కరీంనగర్ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు విరక్తి కలిగిందని అన్నారు.
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి తిరిగి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారని తెలిపారు. కేంద్రంలో అధికారం లో ఉన్నా రాష్ర్టానికి నిధులు తేలేని దుస్థితి బీజేపీదని ఆరోపించారు. విభజన చట్టంలో లేని బీబీనగర్ ఎయిమ్స్ కళాశాలను పార్లమెంటులో పోరాడి తెచ్చామని చెప్పారు. కరీంనగర్‌ను రూ.వెయ్యి కోట్లతో అభివృ ద్ధి చేశామని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే లు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రసమయి పాల్గొన్నారు.