హైదరాబాద్: హుజూరాబాద్ నియోజకవర్గంలో తనకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే తన పేరుతో ఫేక్ ఆడియోను సృష్టించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, విప్ పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఫేక్ ఆడియోతో ముదిరాజ్‌ల మనోభావాలు దెబ్బతింటే, ప్రత్యేకించి హుజూరాబాద్ నియోజకవర్గ ముదిరాజ్ సోదరులను క్షమాపణలు కోరుతున్నానని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ సామాజిక వర్గానికి నిజాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు ఆ కులం, ఈ కులం అనే వ్యత్యాసమేమీ లేదని చెప్పారు. అన్ని కులాల వారిపై తనకెంతో గౌరవం ఉన్నదని, ఆ విషయం హుజూరాబాద్‌లో అందరికీ తెలుసని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ముదిరాజ్ సోదరులకు దూరం చేయాలనే కుట్రలో భాగంగానే తన పేరుతో ఒక ఫేక్ ఆడియోను సృష్టించారని తెలిపారు.
తానొక కెమెరామెన్‌ను కిడ్నాప్ చేశానని అసత్య ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఆ కెమెరామెనే తన ఇంటికి వచ్చి భోజనం చేసి మళ్లీ వెళ్లిపోయాడని, ఆ వీడియోను అందరి ముందు ఉంచానని గుర్తుచేశారు. అందులో కెమెరామెన్ వెళ్లేటప్పుడు ఒక చెక్కు దొంగతనం చేసి వెళ్లడం క్లియర్‌గా కనిపిస్తున్నదని తెలిపారు. అంతేతప్ప తాను ఎవరినీ కిడ్నాప్ చేయలేదని, అదంతా పచ్చి అబద్ధమన్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక అనేక ఫేక్ ఆడియోలు, అసత్య ప్రచారాలు పుట్టుకొస్తున్నాయని, అందులో భాగంగానే తన పేరుతో ఒక ఫేక్ ఆడియో రిలీజ్ చేశారని పేర్కొన్నారు.
తన పేరుతో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఫేక్ ఆడియోపై డీజీపీని కలుస్తానని, తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై ఫిర్యాదు చేస్తానని కౌశిక్ రెడ్డి వెల్లడించారు. ఆ ఆడియో రికార్డును ఫోరెన్సిక్‌కు పంపాలని డీజీపీని కోరుతానని, అప్పుడు అసలు దోషులెవరో తెలంగాణ ముదిరాజ్ సోదరులకు తెలుస్తుందని కౌశిక్ రెడ్డి చెప్పారు.