హైదరాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అస్తిత్వానికి, రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా కొన్ని మీడియా సంస్థలు మళ్లీ జడలు విప్పుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్‌గా ఉండాల్సిన మీడియా, కొందరికి కొమ్ముకాస్తూ మళ్లీ తెలంగాణ ప్రజల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నది. తెలంగాణ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావును డిబేట్‌కు పిలిచి ఆయన పట్ల ఏబీఎన్ టీవీ చానల్ యాంకర్ అగౌరవంగా ప్రవర్తించిన తీరుపై తెలంగాణ సమాజం నివ్వెరపోయింది. స్పీకర్లను డిబేట్‌కు పిలిచినప్పుడు వారి గౌరవానికి ఎలాంటి భంగం కలుగకుండా బాధ్యతలు తీసుకోవాల్సిన టీవీ యాజమాన్యం, నియంత్రణ కోల్పోయి సంస్కారహీనంగా మాట్లాడటంపై తెలంగాణ సమాజం అగ్రహం వ్యక్తం చేస్తున్నది. చర్చలో పాల్గొన్న స్పీకర్ల మధ్య వివాదం ఏర్పడినప్పుడు, దాన్ని సమన్వయం చేస్తూ డిబేట్‌ను సజావుగా నడిపించే బాధ్యత యాంకర్ది. కానీ యాంకరే విచక్షణ కోల్పోయి నీచంగా ప్రవర్తించడం ఒక్క ఏబీఎన్ , ఎల్లో చానళ్లలోనే చూస్తున్నామని తెలంగాణ ప్రజలు భగ్గుమంటున్నారు.
ఎమ్మెల్సీని పిలిచి అవమానించారు
ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో శుక్రవారం రాధాకిషన్‌రావుతో కలిసి కేటీఆర్‌ను సిట్ విచారిస్తున్నట్టు సోషల్ మీడియాలో, కొన్ని ఎల్లో వార్తా చానళ్లు తప్పుడు వార్తలు ప్రసారం చేశాయి. వాస్తవాలతో సంబంధం లేకుండా, ప్రజల్లో గందరగోళం సృష్టించడమే ధ్యేయంగా కొన్ని కట్టుకథలు అల్లాయి. ఇదే సమయంలో ఏబీఎన్ చానల్ తరఫున ఎమ్మెల్సీ రవీందర్రావును చర్చలకు టీవీ చర్చలకు పిలిచారు. ఇతరులతోపాటు టీవీ చర్చల్లో పాల్గొన్న తక్కెళ్లపల్లి.. సిట్ విచారణపై మీడియా సంస్థలు రాస్తున్న కట్టుకథలపై అభ్యంతరాలు వ్యక్తంచేశారు. నేతల వ్యక్తిత్వ హననానికి పాల్పడటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అలా తప్పుడు వార్తలు రాసేవారిని ఏంచేయాలి? అంటూ తనదైన శైలిలో భగ్గుమన్నారు. ఈ సందర్భంగా అసహనానికి లోనైన ఏబీఎన్ యాంకర్ వెంకటకృష్ణ.. తక్కెళ్లపల్లి రవీందర్రావు ఒక ఎమ్మెల్సీ అని కూడా చూడకుండా ఆయన పట్ల తలబిరుసుగా మాట్లాడారు. ‘గెట్ అవుట్ ఫ్రం మై డిబేట్’ అని హెచ్చరిస్తూ మాట్లాడారు. పలుమార్లు గద్దిస్తూ ఎమ్మెల్సీని బెదిరించారు. దానికి మీరే కట్ చేసుకోండి.. అంటూ తక్కెళ్లపల్లి చెప్పి చర్చల నుంచి వైదొలగారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తెలంగాణ ఎమ్మెల్సీపై ఏబీఎన్ యాంకర్ వైఖరిపై తెలంగాణవ్యాప్తంగా ప్రజలు భగ్గుమంటున్నారు.
పచ్చ మీడియాకు బుద్ధిచెప్పాలి: తక్కెళ్లపల్లి
తెలంగాణ అస్తిత్వాన్ని కించపరుస్తూ, అబద్ధాలతో పబ్బం గడుపుకొంటున్న ఈ పచ్చ మీడియాకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నదని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. ‘రెండు మూడు రోజులుగా డిబేట్‌కు రావాలని ఒత్తిడి చేస్తే తన ఇంటి నుంచే ఏబీఎన్ డిబేట్లో పాల్గొన్న. చర్చ సందర్భంగా లీకుల పేరుతో కిషన్‌రావుతో కలిపి కేటీఆర్‌ను సిట్ విచారించినట్టు నిరాధార ఆరోపణలను తెలంగాణ సమాజం మీదికి వదిలితే.. అవి చేస్తున్న గుండెగాయాలకు బాధ్యత ఎవరు వహించాలె? ఎవ్వడుపడితే వాడు ఏదిబడితే అది ప్రచారం చేస్తరా?అని జనరలైజ్ చేసి ధర్మాగ్రహం వ్యక్తంచేసిన. లీకేజీ వార్తలు, పిచ్చిరాతలు రాసే వారిని శిక్షించాలన్న. ఎవరి పేరు, చానల్ పేరును నేను ప్రస్తావించలేదు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతిని, వెంకటకృష్ణను అసలే అనలేదు. కానీ, గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా వెంకటకృష్ణ స్పందించారు. ‘గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్’ అంటూ గద్దించారు. ఒక తెలంగాణ ప్రజాప్రతినిధిని డిబేట్‌కు పిలిచి అవమానించారు. కేసీఆర్ కుటుంబంపై ప్రతిష్ఠను దెబ్బతీయాలని, ఛిద్రం చేయాలనే ఎల్లో మీడియా కోరిక ఎప్పటికీ నెరవేరదు. ఆ చానళ్లు, పత్రికలు ఏమిటి అనేది త్వరలోనే ప్రకటిసా. ఆయా మీడియా సంస్థల వ్యవహారశైలిని ఎండగట్టి తీరుతం. వాటికి వ్యతిరేక కార్యాచరణ రూపొందిస్తాం. ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాల తరహాలోనే తెలంగాణ వ్యతిరేక మీడియాపై పోరాటాలు చేస్తాం’ అని తక్కెళ్లపల్లి హెచ్చరించారు.
ఓయూలో ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులు చించివేత
తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా పనిచేస్తున్న మీడియాను తరిమికొడతామని బీ ఆర్ఎస్వీ నాయకుడు నాగేందర్రావు హెచ్చరించారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావుతో ఏబీఎన్ జర్నలిస్టు వెంకటకృష్ణ వ్యవహరించిన తీరు సరిగా లేదని చెప్పారు. వెంకటకృష్ణ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆంధ్రజ్యోతి, ఏబీఎన్‌ను తెలంగాణలో నడపనీయబోమని హెచ్చరించారు. శనివారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రతులు, వెంకట కృష్ణ చిత్రపటాన్ని చించివేసి దహ నం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు అవినాశ్, నిఖిల్, విజయ్, రాజ్‌కుమార్, మహేశ్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.