హనుమకొండ, ఆగస్టు 1 : పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో వెంటనే రాజీనామా చేయించడంతో పాటు స్పీకర్ వారిపై అనర్హత వేటు వేయాలని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు డిమాండ్‌చేశారు. రాజీవ్‌గాంధీ తీసుకొచ్చిన పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ అపహాస్యం చేస్తున్నదని విమర్శించారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2023 నవంబర్‌లో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేల అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్టు తెలిపారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలంగాణ శాసనసభ స్పీకర్‌ను ఆదేశించడంతో పార్టీ మారిన కాంగ్రెస్ నాయకులు పండుగ చేసుకుంటున్నారని ఎద్దేవాచేశారు. రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి డమ్మీ సీఎం అని లీడర్‌కు, క్యాడర్‌కు ఎప్పుడో తెలిసిపోయిందని ఎద్దేవాచేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఎకువైనందునే మీనాక్షి నటరాజన్ పాదయాత్ర చేపడుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇన్చార్జి ఏనాడైనా పాదయాత్ర చేసిన చరిత్ర ఉందా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీల అమలు విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తే బీఆర్ఎస్పై కక్ష సాధింపు చర్యలకు పూనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.