ఖైరతాబాద్, ఆగస్టు 1: కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని గిరిజన యువతను నమ్మించి మోసం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ధ్వజమెత్తారు. గిరిజన రిజర్వేషన్ సాధన సమితి చైర్మన్ భూక్యా సంజీవ్‌నాయక్ అధ్యక్షతన ‘గిరిజన రిజర్వేషన్లను కాపాడుకుందాం- కాంగ్రెస్ హామీ మేరకు 12 శాతానికి పెంచాలి’ అన్న డిమాండ్‌తో గురువారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు పెద్దపీట వేసిందని, నాడు సీఎంగా కేసీఆర్ గిరిజనుల సంక్షేమానికి విశేష కృషి చేశారని కొనియాడారు. రాష్ట్రంలో యువత సందిగ్ధ పరిస్థితిలో ఉన్నదని, ఉద్యోగాలు వస్తాయో, రావోనన్న భయాందోళనలో ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నదని, ముఖ్యంగా గిరిజన యువత చేస్తున్న పోరాటాల్లో ఒక ఎమ్మెల్సీగా కాకుండా తల్లిగా వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. గిరిజన యువత, విద్యార్థుల సమస్యలపై శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తానని తెలిపారు. గిరిజనుల హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకోబోమని మాజీ ఎంపీ సీతారాంనాయక్ హెచ్చరించారు.
జీవో నం.33, 3పై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని, వాటిని కాపాడుకోవడానికి, 12 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 9న చలో హైదరాబాద్ పేరుతో ఆదివాసీ, గిరిజన సింహగర్జన నిర్వహించనున్నామని భూక్యా సంజీవ్‌నాయక్ వెల్లడించారు. సమావేశంలో న్యాయవాది జోగురాం నాయక్, మొగిలి మల్లయ్య, సైదానాయక్, సమితి నాయకులు రవి రాథోడ్, నర్సింహ, మిత్ర, సుదీర్, సురేశ్, విజయ్, అర్చన, పరమేశ్వరి తదితరులు పాల్గొన్నారు.