హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): ‘సీఎం రేవంత్‌రెడ్డి.. ఏడాది పాలనలో ఏం ఉద్ధరించారని వరంగల్‌లో విజ యోత్సవ సభ పెడ్తున్నరు? మీరు పెట్టాల్సింది విజయోత్సవ సభకాదు.. విద్వేష, విశ్వా సఘాతుక, విధ్వంస సభలు పెట్టాలె’ అంటూ శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఫైర్ అయ్యారు. సత్యవాది అయిన కాళోజీ నారాయణరావు కళాక్షేత్రాన్ని ప్రారంభించే హక్కు అసత్యవాది అయిన రేవంత్‌రెడ్డికి ఎక్కడిది? అని నిలదీశారు. బీఆర్ఎస్ పాలనలో నిర్మితమైన కళాక్షేత్రానికి కాంగ్రెస్ సర్కార్ రంగులు వేసి రిబ్బన్ కట్ చేయడం సిగ్గుచేటని విరుచుకుపడ్డారు.‘ఎన్నికల ముందట వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట గొప్పలు చెప్పి..ఇప్పుడు రైతుబంధు ఎగ్గొట్టి, రుణమాఫీకి ఎగనామం పెట్టి, కౌలు రైతుకిచ్చిన హామీలను గాలికొదిలిన రేవంత్‌రెడ్డి, ఏ ముఖం పెట్టుకొని ఇక్కడ సభ పెడుతున్నారు?’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పొద్దున లేస్తే అబద్ధాలు చెప్పే రేవంత్‌రెడ్డి, కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తే కాళోజీ ఆత్మ ఘోషిస్తుందని ఆక్షేపించారు.
ఆచార్య జయశంకర్, చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ లాంటి పోరాటయోధులు పుట్టిన గడ్డపై కాంగ్రెస్ విజయోత్సవ సభ పెట్టడం బాధాకరమన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు సోమ భరత్‌కుమార్, డాక్టర్ ఆంజనేయగౌడ్, పల్లె రవికుమార్, అలకుంట హరితో కలిసి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అటకెక్కించి మోసం చేసిన సీఎం రేవంత్, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సిగ్గులేకుండా అబద్ధాలు ప్రచారం చేయడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ప్రతినెలా రూ.30 వేల కోట్ల రాబడి వస్తేనే పాలన సాఫీగా సాగుతుందని, కేవలం రూ.18 వేల కోట్లే వస్తున్నాయని చెప్తున్న ముఖ్యమంత్రి ఏ పథకాలకు కోతపెడతారో చెప్పాలని నిలదీశారు. లగచర్ల ఘటనతో రాష్ట్రంలో ఎమర్జెన్సీ తరహా వాతావరణం బయట ప్రపంచానికి తెలిసిందన్నారు.