హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న జీఎస్టీ పన్నును రీయింబర్స్ చేస్తామని కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమలు ఎకడివరకు వచ్చిందో చెప్పాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా చేనేతలకు జీఎస్టీ రీయింబర్స్ కోసం మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయలేదని విమర్శించారు. సోమవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. జగిత్యాలలో పట్టు పురుగుల పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 16కోట్లు కేటాయించినప్పటికీ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి ఆసక్తి లేకపోవడం శోచనీయమని వాపోయారు. గతంలో రాష్ట్రంలో లేని పట్టుగూళ్ల సాగు(మల్బరీ సాగు) కేసీఆర్ హయాంలో 13 వేల ఎకరాలకు పెరిగిందని గుర్తు చేశారు. రూ.8 కోట్ల పట్టుగూళ్ల బకాయిలను చేనేతలకు వెంటనే చెల్లించాలని కోరారు. సెరికల్చర్ శాఖలో 650 ఉద్యోగాలకు 400మంది రిటైర్ అయ్యారని, వారి స్థానంలో కొత్తవారిని నియమించాలని కోరారు. ఆసిఫాబాద్, భద్రాచలం వంటి గిరిజన ప్రాంతాల్లో తేనెటీగల కాలనీలను ప్రోత్సహించాలని సూచించారు. ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్ల స్ఫూర్తిని దెబ్బతీయవద్దని పేర్కొన్నారు. కొన్ని పోస్టులకు డీరిజర్వేషన్ చేయడం సరికాదని మండిపడ్డారు.
బీసీల విదేశీ విద్యకు నిధులు ఇవ్వరా?
పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు రూ.10 వేల కోట్లు బిల్లులు చెల్లించామని ప్రభుత్వమే చెబుతుందని, అలాంటిది బీసీ విద్యార్థులకు ఎందుకు విదేశీ విద్య నిధులు ఇవ్వడం లేదో చెప్పాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. గురుకులాల్లో నూతన డైట్ మెనూ ఎప్పటి నుంచి అమలు అవుతుందో స్పష్టం చేయాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో గురుకులాల నాణ్యత కూడా పడిపోయిందని మండిపడ్డారు. ప్రతీ రోజూ ఎకడో ఒక చోట ఫుడ్ పాయిజన్ కేసు నమోదవుతున్నదని ప్రస్తావించారు. విషాహారం తిని 53మంది విద్యార్థులు చనిపోయారని, మరణించిన వారి కుటుంబాలకు నష్టపరిహారం ఇస్తారా..? ఇవ్వరా అన్నది ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని నిలదీశారు. కేసీఆర్ హయాంలో ఏడాదికి 27 గురుకులాలు ఏర్పాటయ్యాయని, కానీ రేవంత్ హయాంలో ఒకటి కూడా ఏర్పాటు చేయలేదని విమర్శించారు. గతంలో కేవలం 19 బీసీ సంక్షేమ పాఠశాలలను ఏర్పాటు చేస్తే.. పదేండ్లల్లో కేసీఆర్ 275 బీసీ పాఠశాలలను, 31 బీసీ డిగ్రీ కాలేజీలను, ప్రత్యేకంగా బీసీలకు రెండు వ్యవసాయ కాలేజీలను ఏర్పాటు చేశారని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు రూ.14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేసిందని తెలిపారు. చేనేతలకు రూ.1200కోట్లు, యాదవులకు రూ.5 వేల కోట్లు, 67వేల మంది గౌడన్నలకు పెన్షన్ ఇచ్చామని వివరించారు. 2230 బీసీ విద్యార్థుల విదేశీ విద్యకు రూ.450 కోట్లు ఖర్చు చేశామని పేరొన్నారు.
రేవంత్ ఢిల్లీకి వెళ్లి ఏం సాధించారు?
నెలకు రెండుమూడు సార్లు ఢిల్లీకి వెళ్లి సీఎం రేవంత్రెడ్డి కేంద్ర మంత్రులను కలిశారని, మరి ప్రతి జిల్లాకు రావాల్సిన నవోదయ విద్యాలయాలను ఎన్ని సాధించారు? అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాలను ఎన్ని గుర్తించారు? వెనుకబడిన జిల్లాలకు నిధులు సాధించారా?అన్నది ప్రభుత్వం చెప్పాలని నిలదీశారు. ఇన్ని సార్లు ఢిల్లీ వెళ్లడమే కాకుండా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి అదనపు నిధులు ఏం తీసుకొచ్చిందని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
చేనేత కుటుంబాలను ఆదుకోవాలి: ఎమ్మెల్సీ ఎల్ రమణ
ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని, బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ కోరారు. గత ప్రభుత్వ హయాంలో నేతన్న బీమా పథకం ద్వారా ఆదుకున్నామని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో 28 మంది ఆత్మహత్య చేసుకోగా, బాధిత కుటుంబాలకు న్యాయం జరగలేదని సభలో పేర్కొన్నారు. గతంలో చెప్పినట్టుగా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు పింఛన్ అందించాలని కోరారు. చేనేత కార్మికుల రుణమాఫీ చేయడంతో పాటు రాహుల్ గాంధీ హామీనిచ్చిన జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.