మహబూబాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం పీపీపీ మోడ్‌లో పనిచేస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. పీపీపీ అంటే.. ఫోబియా, పాలిటిక్స్, పర్సెంటేజ్ అని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేసీఆర్ ఫోబియా పట్టుకున్నదని, మైక్ పట్టగానే కేసీఆర్‌ను తిట్టడం మించి ఇంకో ఆలోచన రావడంలేదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 10 పర్సంటేజీ సర్కార్ అని పిలుస్తున్నారని విమర్శించారు. పర్సెంటేజీ ఇస్తేనే పనిచేస్తున్నారని కొంతమంది ప్రభుత్వంలోని వారే ఆరోపిస్తున్నారని అన్నారు. కవిత సోమవారం మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. దంతాలపల్లి మండలం రామానుజపురంలో తన సహకారంతో బీఆర్ఎస్ కార్యకర్త చిర్ర సతీశ్ ఏర్పాటు చేసిన ఇంటర్నెట్-జిరాక్స్ సెంటర్‌ను ప్రారంభించారు.
అనంతరం కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించారు. అంతకుముందు ముందు మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నాగర్‌కర్నూల్‌లో ఎస్ఎల్బీసీ సొరంగం కూలిపోతే దాన్ని సందర్శించే సోయిలేని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి వెళ్లారని మండిపడ్డారు. ప్రజలకు ఏం చేశారని రేవంత్‌రెడ్డి ప్రచారంలో చెప్తున్నారని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి సరారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని, రాజకీయం తప్ప పరిపాలనపై దృష్టి లేదని ఆరోపించారు. పండించిన పంటకు ధర లేక మిర్చి రైతులు కన్నీరు పెట్టే పరిస్థితి ఏర్పండిందని, రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేదని విమర్శించారు. మిర్చి క్వింటాకు రూ.25 వేల చొప్పున మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ప్రచార(పీఆర్) స్టంట్ల మీద ఉన్న సోయి ప్రజల కోసం పనిచేయడంలో లేదని అన్నారు. కేసీఆర్ హయాంలో మహబూబాబాద్ జిల్లా వేగంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ అభివృద్ధి కుంటుపడిందని చెప్పారు. ఆకేరు వాగు పొంగి వరదలు వచ్చినప్పుడు నష్టపోయిన వారికి ప్రభుత్వం ప్రకటించిన సాయం ఇప్పటికీ అందలేదని చెప్పారు. వరదలొచ్చినా, కన్నీళ్లిచ్చినా, కష్టాలొచ్చినా ప్రజలకు అండగా ఉండేది గులాబీ జెండా(బీఆర్ఎస్) ఒక్కటేనని ఎమ్మెల్సీ కవిత అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేయవద్దని విజ్ఞప్తి చేశారు.
కేసముద్రంలోని మిర్చి యార్డులను ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. మిర్చి రైతుల కష్టాలు, ఇబ్బందులు, ధరల గురించి అడిగి తెలుసుకున్నారు. గిట్టుబాటు ధరలు రావడంలేదని, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని రైతులు తమ గోడును చెప్పుకున్నారు. ‘ముఖ్యమంత్రి ఢిల్లీ పోతారో, ప్రధాని మోదీ కాళ్లు పట్టుకుంటారా… ఏం చేస్తారో మాకు సంబంధం లేదు. మిర్చికి క్వింటాకు కచ్చితంగా రూ.25 వేల మద్దతు ధర సాధించాల్సిందే’ అని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి ధరలు తగ్గితే ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి లొల్లిలొల్లి చేశారని, ఇకడ మన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒక్క మాట మాట్లాడటం లేదని విమర్శించారు.
నిరుడు క్వింటాలు మిర్చి ధర రూ.25 వేలు ఉండగా, ఇప్పుడు రూ.11 వేలకు పడిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. మహబూబాబాద్-కేసముద్రం ప్రాంతానికి చెందిన ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి ఎప్పుడూ సీఎం రేవంత్‌రెడ్డి చుట్టే ఉంటారని, మిర్చి రైతుల కష్టాలు సీఎంకు చెప్పడానికి ఆయనకు ఒక నిమిషం దొరకడం లేదా అని ప్రశ్నించారు. కవితతోపాటు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, తకళ్లపల్లి రవీందర్రావు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, రెడ్యానాయక్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ పాల్గొన్నారు.
కార్యకర్తలే బీఆర్ఎస్కు ఆయువుపట్టు
హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): కార్యకర్తలే బీఆర్ఎస్కు ఆయువుపట్టు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. పార్టీని నమ్ముకున్న నాయకులు, వారి కుటుంబాలకు అం డగా ఉండటం కేసీఆర్ మనకు నేర్పిన బాధ్యత అని సోమవారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. కేసీఆర్ చూపిన బాటలో ఆయన వీరాభిమాని చిర్రా సతీశ్‌కు ఉపాధి కల్పించేందుకు చేయూతనందించానని పేర్కొన్నారు. సతీశ్ స్వగ్రామం మహబూబాబాద్ జిల్లాలోని రామానుజపురంలో ‘కేసీఆర్ ఇంటర్నెట్-జిరాక్స్’ సెంటర్‌ను ప్రారంభించే అవకాశం తనకు దక్కడం ఎంతో సంతోషకరమని తెలిపారు.