MLC Kavitha | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క బీసీ గురుకుల పాఠశాలను కూడా ఏర్పాటు చేయలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. కనీసం గురుకులాలను ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి లేకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు.
సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేవలం19 బీసీ సంక్షేమ పాఠశాలలను మాత్రమే ఏర్పాటు చేసిందని తెలిపారు. కానీ పదేండ్లలో కేసీఆర్ 275 బీసీ పాఠశాలలను, 31 బీసీ డిగ్రీ కాలేజీలను, ప్రత్యేకంగా బీసీలకు రెండు వ్యవసాయ కాలేజీలను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. బీసీలకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.14వేల కోట్లు విడుదల చేసిందని చెప్పారు.
దీని ద్వారా 15 లక్షల విద్యార్థులకు లబ్ది జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా కొత్త బీసీ గురుకులాలు ఏర్పాటు చేయలేకపోవడం బాధాకరమని అన్నారు.
కేసీఆర్ హయాంలో 2230 బీసీ విద్యార్థులకు విదేశీ విద్య కింద రూ. 450 కోట్లు ఖర్చు చేశామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం విదేశీ విద్యకు ఎలాంటి ప్రోత్సహకాలు అందించలేదని చెప్పారు. ఎందుకు ఇంత ఆలస్యమవుతుందని కాంగ్రెస్ సర్కార్ను నిలదీశారు. గురుకులాల్లో మెనూ మార్చామని చెబుతున్నారని.. కానీ ఇంకా స్కూల్స్లో ప్రారంభించలేదని అన్నారు. కొత్త మెనూను ఎప్పటి నుంచి ప్రారంభిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి నెలకు రెండు మూడు సార్లు ఢిల్లీకి వెళ్లారని కవిత అన్నారు. ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రులను కలిసిన రేవంత్ రెడ్డి.. జిల్లాకొకటి రావాల్సిన నవోదయ విద్యాలయాలను ఎన్ని సాధించారని ప్రశ్నించారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు సాధించారా అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ అదనంగా ఎన్ని నిధులు తీసుకొచ్చారని ప్రశ్నించారు.