హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వానికి సలహాదారులే ఉండవద్దని కేసులు వేసిన రేవంత్‌రెడ్డి.. ఇవాళ ఎంతమందిని సలహాదారులుగా నియమించుకున్నారో చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌చేశారు. రాజకీయ నాయకులను సలహాదారుగా నియమించుకోవచ్చని, కానీ ఢిల్లీలో ఒక మాజీ న్యాయమూర్తి వద్ద పనిచేసిన వ్యక్తిని ఓ కొత్త పోస్టు సృష్టించి అసెంబ్లీకి సలహాదారునిగా నియమించడమేంటి? అని ఆమె ప్రశ్నించారు. కవిత గురువారం తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ తరఫున వాదనలు వినిపించిన దేవనా సైగల్‌ను సుప్రీంకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా, తేర రజినీకాంత్రెడ్డిని అదనపు అడ్వకేట్ జనరల్‌గా నియమించడాన్ని తప్పు పట్టారు. కేసీఆర్ హయాంలో ప్రాజెక్టులను ఆపడానికి దొంగ కేసులు వేసిన ఒక న్యాయవాదిని సుప్రీంకోర్టులో అడ్వకేట్ ఆన్ రికార్డుగా నియమించడాన్ని తీవ్రంగా ఖండించారు.
అత్యంత కీలకమైన విద్యుత్తు సంస్థలో ప్రభుత్వం నియమించిన నలుగురు డైరెక్టర్లలో ముగ్గురు స్థానికేతరులే ఉన్నారని కవిత మండిపడ్డారు. నందకుమార్, నర్సింలు, సుధా మాధూరిని డైరెక్టర్లుగా నియమించారని కవిత పేరొన్నారు. తెలంగాణకు చెందిన ఏడుగురు సీనియర్ అధికారులను పకనబెట్టి ధర్మాధికారి కమిషన్ నివేదికను సాకుగా చూపించి స్థానికేతరులను నియమించారని, తెలంగాణ ప్రయోజనాలపై వాళ్లకు ఏం ఆసక్తి ఉంటుందని ప్రశ్నించారు. ఈ ముగ్గురు డైరెక్టర్లను తొలగించి తెలంగాణ వారిని నియమించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ మ హేందర్రెడ్డిపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన్ను తప్పించాలని కోరారు. టీఎస్పీఎస్సీ సభ్యుడిగా నియమించిన రామ్మోహన్రావు తె లంగాణ వ్యక్తి కాదన్నారు. రాజకీయాల్లో ఉన్న వారిని సభ్యులుగా నియమించబోమని చెప్పిన సీఎం టీడీపీలో పనిచేసిన రజనీకుమారిని ఎలా ని యమించారని నిలదీశారు. త్వరలో తాము ఈ అంశంపై గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందిస్తామని వెల్లడించారు.
తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు, రాష్ట్ర గీతంపై విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు కవిత సమాధానమిస్తూ.. సీఎం రేవంత్‌రెడ్డి నిజంగా హృదయంపై చేయి వేసుకొని జై తెలంగాణ అంటే ఇవన్నీ చేసే అర్హత ఉంటుందని అన్నారు. ఎప్పుడూ జై తెలంగాణ అనని వ్యక్తి తెలంగాణ తల్లి, రాష్ట్ర గీతం గురించి మా ట్లాడడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
ఈ ఏడాది డిసెంబరులోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కేవలం 60 మాత్రమే కొత్త ఉద్యోగాలను నోటిఫై చేసిందని కవిత ప్రస్తావించారు. గతంలో కేసీఆర్ నోటిఫై చేసిన ఉద్యోగాలనే ఇప్పుడు ఇస్తున్నారని చెప్పారు. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలు వచ్చిన వారికి సీఎం రేవంత్‌రెడ్డి నియామక పత్రాలను అందించడం సిగ్గుచేటని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీయే డిపెండెంట్ ఉద్యోగాలను రద్దు చేసిందని గుర్తుచేశారు. ‘మీ గురువు చంద్రబాబు హయాంలో సింగరేణిలో గోల్డెన్ హ్యాండ్‌షేక్ ఇచ్చి ఉద్యోగులను తొలగించి సంఖ్యను కుదించారు. కాబట్టి అబద్ధ్దాలు చెప్పడం మానేసి కొత్తగా వేసిన ఉద్యోగాలు ఎన్నో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డిలో పచ్చ రక్తం ప్రవహిస్తున్నదని అన్నారు.