Jai Telangana | సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అంటే ద్వేషమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ అంటే ఆయనకు అసహనమని తెలిపారు. తెలంగాణ ఉద్యమం రావడం మీదనే ఆయనకు ఉక్రోశం ఉందని విమర్శించారు. హైదరాబాద్ ఉప్పల్ సమీపంలోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్లో శనివారం నాడు నిర్వహించిన బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి సదస్సుకు దేశపతి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి జై తెలంగాణ అని ఎందుకు అనడో వివరించారు.
జై తెలంగాణ నినాదం అంటే మన విజయగాథ.. మనం సాధించిన విజయ చరిత్ర అని దేశపతి శ్రీనివాస్ అన్నారు. ఆ నినాదం తలచుకుంటే మనకు అనేక సంఘటనలు గుర్తుకొస్తాయని తెలిపారు. సకల జనుల సమ్మె, సాగర హారం, వంటవార్పు, రోడ్ల దిగ్భందం, చివరకు తెలంగాణను సాధించిన విజయగాథ గుర్తొకొస్తదని చెప్పారు. ‘అదే రేవంత్ రెడ్డికి తన అవమానం గుర్తొస్తది. తాను ఓడిపోయి సంగతి యాదికొస్తది. చివరి నిమిషం దాకా తెలంగాణ రాకుండా ఆపేందుకు చేసిన ప్రయత్నాలు గుర్తొస్తాయి. అందుకే ఆయన జై తెలంగాణ అని అనడం ఇష్టం ఉండదు.’ అని తెలిపారు. జై తెలంగాణ నినాదం అంటే చంద్రబాబు తెలంగాణ పొలిమేర దాటి ఆంధ్రా కరకట్టకు పోయిన సంగతి యాదికొస్తది అని చెప్పారు. చంద్రబాబు విజయవాడకు పోయిండు.. రేవంత్ రెడ్డి చంచల్‌గూడకు పోయిండు.. జై తెలంగాణ అంటే అది గుర్తొస్తది.. అందుకే ఆయనకు జై తెలంగాణ అని అనడం ఇష్టం ఉండదని వివరించారు.
జై తెలంగాణ అని రేవంత్ రెడ్డి ఎందుకు అనడో సవివరంగా చెప్పిన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ 🔥 pic.twitter.com/EZBOWnvwVS
— BRS Party (@BRSparty) July 26, 2025
తెలంగాణ ప్రజల మీద కసి తీర్చుకుంటున్నాడు
మొదటి నుంచి తెలంగాణ రాకుండా ఆపాలని కుట్రలు జరిపింది.. ఆ కుట్రల్లో ప్రతి దశలో ఉన్నవాడు రేవంత్ రెడ్డి అని దేశపతి శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని బలహీనపరిచేందుకు ప్రయత్నించినవాడు రేవంత్ రెడ్డి అని విమర్శించారు. రేవంత్ రెడ్డి తెలంగాణకు చేయని ద్రోహం లేదు.. పాలుపంచుకోని మోసం, కుట్ర లేదని అన్నారు. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల మీద రేవంత్ రెడ్డి బద్లా, కసి తీర్చుకుంటున్నాడని మండిపడ్డారు.
అక్కడ బాబు చెబుతాడు.. ఇక్కడ బానిస పాటిస్తాడు
దేవుడు శాసిస్తాడు.. అరుణాచలం పాటిస్తాడని.. అదేదో సినిమాలో రజినీకాంత్ డైలాగ్ చెప్పినట్లుగా.. విజయవాడలో ఉన్న బాబు శాసిస్తాడు.. ఇక్కడ ఉన్న బానిస పాటిస్తాడని దేశపతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. మొదట బనకచర్ల మీటింగ్‌కు పోనే పోనని రేవంత్ రెడ్డి అన్నారని గుర్తుచేశారు. కానీ రాత్రికి రాత్రి చంద్రబాబు చెప్పగానే.. పొద్దున్నే విమానం ఎక్కి వెళ్లాడని అన్నారు. ఢిల్లీకి వెళ్లి చంద్రబాబు ఏం కోరుకుంటున్నాడో అది చేసి వచ్చాడని మండిపడ్డారు. ఇవాళ తెలంగాణ సామంత రాజ్యంగా మారిందని అన్నారు. ఇప్పుడు తెలంగాణను పాలిస్తున్నది రేవంత్ రెడ్డి ఒక్కడే కాదని అన్నారు. రేవంత్ రెడ్డి, రేవంత్ మీద ఉన్న చంద్రబాబు నాయుడు, చంద్రబాబుతో జతకట్టిన మోదీ కలిసి తెలంగాణను పరిపాలిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు ఇంట్రెస్ట్‌ను నెరవేర్చేందుకే రేవంత్ రెడ్డి ప్రయత్ని్సతున్నాడని తెలిపారు.