హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి ప్రోద్బలంతోనే ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు రెచ్చిపోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ముగ్గురు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నపుడు ఎలా ఉండేవారని, ఇప్పుడు ఎలా అయ్యారని ఆశ్చర్యం వ్యక్తంచేశారు. కౌశిక్‌రెడ్డి వివాదంలో ఆంధ్ర, తెలంగాణ వివాదం లేదని, సీఎం కావాలనే దానినో వివాదంగా చేయాలని చూస్తున్నారని తెలిపారు. అసలు తెలంగాణ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డే ఆటంకంగా మారారని ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దృష్టి మళ్లించడానికి సీఎం ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష నేతలపై వికృత దాడులు చేస్తున్నారని, నిర్బంధిస్తున్నారని ధ్వజమెత్తారు. దాడుల సంసృతి రాష్ట్రానికి మంచిది కాదని, పోరాడి సాధించుకున్న తెలంగాణను నాశనం చేయాలని రేవంత్‌రెడ్డి కంకణం కట్టుకున్నారంటూ ఆరోపించారు. తెలంగాణను ప్రేమించే వారు రేవంత్ తీరును ఖండించాలని, పదేండ్ల కేసీఆర్ పాలనలో ఇలాంటి దాడుల సంసృతి ఉన్నదా? దీనిని కాంగ్రెస్ ఆహ్వానిస్తుందా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీ మీద జరుగుతున్న ఈ దాడులను తెలంగాణ మేధావులు ఖండించాలని హితవు పలికారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడానికి గాంధీ ద్వారా రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించేందుకే సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు పన్నుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత దేవీప్రసాద్ అనుమానం వ్యక్తంచేశారు. ప్రతిపక్షంపై దాడుదలకు పురికొల్పుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలపై అణిచివేత ధోరణి సరికాదని హితవు పలికారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్నింటిపైనా ప్రజలు లెక్కలు రాస్తున్నారని, తగిన సమయంలో బుద్ధిచెపుతారని హెచ్చరించారు. కాంగ్రెస్‌కు మద్దతు తెలిపిన మేధావులు, బుద్ధిజీవులు ఇప్పుడు స్పందించాలని కోరారు.