హైదరాబాద్, మార్చి 29(నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి పాలనలో జరిగిన అవినీతి, కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, లేకుంటే హౌస్ కమిటీని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ శాసనసభా పక్షం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆదివారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాశారు. ‘మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్ల కాలంలో రాష్ట్రం అవినీతి, కుంభకోణాల కేంద్రంగా మారిపోయిన దుస్థితి నెలకొన్నది. లెకకు మించిన కుంభకోణాలు వరుసగా బయటపడుతుండటం మాత్రమే కాకుండా, స్వయంగా మంత్రులు, ప్రజాప్రతినిధుల ప్రమేయంతో ఈ అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తున్నాయి. ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని పూర్తిగా ఛిద్రమయ్యేలా చేసిన ఘనత మీ ప్రభుత్వానికే దకుతుంది. దాదాపు అన్ని శాఖల్లో అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగం యథేచ్ఛగా సాగుతుండగా, వాటిని అడ్డుకునే బాధ్యత వహించాల్సినవారే ఈ దోపిడీకి మూలస్తంభాలుగా మారిన పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తున్నది. బాధ్యత వహించాల్సిన మంత్రులే కుంభకోణాల్లో నేరుగా ప్రమేయం కలిగి ఉన్నారనే ఆరోపణలు రావడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ మాత్రమే కాదు, అవమానం కూడా’ అని బీఆర్ఎస్ శాసనసభాపక్షం పేర్కొన్నది.
‘ఈ కుంభకోణాల ఫలితంగా వేల కోట్ల రూపాయల ప్రజా ధనం కొద్దిమంది చేతుల్లోకి వెళ్లిపోతుండగా, సామాన్య ప్రజలకు అందాల్సిన సంక్షేమం, అభివృద్ధి పూర్తిగా దెబ్బతింటున్నది. మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన పారదర్శకత, బాధ్యతాయుత పాలన అనే హామీలు నీటి మూటలుగా మారిపోయాయి. మాటల్లో నీతి వాక్యాలు.. చేతల్లో దోపిడీ.. ఇదే మీ పాలనకు ప్రతీకగా మారింది. అవినీతిని అరికట్టడంలో మీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందనే విషయం కుండబద్దలు కొట్టినట్టు స్పష్టమైంది. ఈ పాలనలో నియంత్రణ లేకుండా సాగుతున్న ఈ దోపిడీని చూస్తే, ఇది నిర్లక్ష్యమా? లేక మీ ప్రోత్సాహమా? అన్న అనుమానం ప్రజల్లో మరింత బలపడుతున్నది.
అవినీతి, కుంభకోణాలపై లేఖ రాస్తే విచారణ జరుపుతామని శాసనసభలో స్వయంగా మీరే ప్రకటించారు. కాబట్టి మీ పాలనలో జరిగిన కుంభకోణాల వివరాలు అందిస్తున్నాం. మీ మాటపై మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ఈ కుంభకోణాలపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ఇందులో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రజాధనాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. విచారణ నిష్పక్షపాతంగా జరుగాలంటే ఆరోపణలు ఎదురొంటున్న వారు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయడం తప్పనిసరి అన్న విషయాన్ని గుర్తుచేస్తున్నాము. ప్రజా ధనాన్ని రక్షించడం, ప్రభుత్వంపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడం, అవినీతి అక్రమాలను అడ్డుకోవడం రాజ్యాంగబద్ధమైన మీ బాధ్యత అని తెలియచేస్తున్నాము’ అని స్పష్టంచేసింది.
సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో బీఆర్ఎస్ పేర్కొన్న స్కామ్‌ల జాబితా