BRS |అసెంబ్లీ సమావేశాల తొలి రోజు నుంచే రేవంత్ ప్రభుత్వం నిర్భందకాండ కొనసాగుతోంది. హామీల అమలుపై ప్రశ్నించినందుకు తొలిరోజే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాడి చేయించింది. ఇవాళ మహిళా ఎమ్మెల్యేలపై దాడి ఘటనలపై నిలదీసినందుకు సభ నుంచి సస్పెన్షన్ వేటు వేసింది. 17 మంది బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేశారు. ఈ సెషన్ ముగిసేంత వరకు ఈ సస్పెన్షన్ కొనసాగుతోందని తీర్మానం చేశారు.
దీనిపై మిగతా బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. సభ లోపలే తమ నిరసనను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బుధవారం నాడు తమ ఎమ్మెల్యేలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించాలని కోరుతూ బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘వీ వాంట్ జస్టిస్’ అంటూ సభలో తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు.