హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం రుణమాఫీ చేయకుండా రైతాంగాన్ని మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసకు ఉపక్రమించారు. నల్లబ్యాడ్జీలు ధరించి, ప్లకార్డులు ప్రదర్శిస్తూ అసెంబ్లీలోకి వచ్చారు. ఈ సందర్భంగా ‘రుణమాఫీ బూటకం, కాంగ్రెస్ నాటకం, రుణమాఫీ అరకొర, కాంగ్రెస్ కొరకొర, మాట తప్పిన కాంగ్రెస్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అధికారం కోసం అబద్ధాలు చెప్పి, గద్దెనెక్కిన తర్వాత తప్పించుకోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. నల్లబ్యాడ్జీలతోనే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.
అన్నదాతల ఆందోళనలు భగ్నం
రుణమాఫీపై కాంగ్రెస్ సర్కారు వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అసెంబ్లీ ముట్టడి కోసం బయల్దేరిన రైతులను పోలీసులు ఎక్కడిక్కడ అరెస్టు చేశారు. ఆటోలో అసెంబ్లీ వద్దకు చేరుకున్న పలువురు రైతులను పోలీసులు గేటు వద్ద అడ్డుకున్నారు. బలవంతంగా అదుపులోకి తీసుకొని ఠాణాకు తరలించారు. ప్రభుత్వ తీరుపై రైతు సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. మాట తప్పిన కాంగ్రెస్కు బుద్ధి చెబుతామని హెచ్చరించారు.