MLA Vivekananda | హైదరాబాద్ : ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బట్టలు విప్పేందుకు సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఎలాంటి చర్చకైనా బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆయన తేల్చిచెప్పారు. అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడారు.
ఉత్తర తెలంగాణ సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. సీఎం రేవంత్ రెడ్డి బురద రాజకీయం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీపైన బురదచల్లడానికి రేవంత్ రెడ్డి అసెంబ్లీని రాజకీయ వేదికగా వాడుకుంటున్నారు. అకాల వర్షాలు, వరదలతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ప్రజలను, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. బీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టేందుకు పీసీ ఘోష్ కమిషన్‌ను రేవంత్ రెడ్డి అడ్డం పెట్టుకున్నారు. రాష్ట్రంలో వరదలు వస్తే సీఎం బీహార్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. తెలంగాణ హెలికాప్టర్‌ను రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారానికి రేవంత్ రెడ్డి పంపించారు. రేవంత్ రెడ్డికి అధిష్టానం మాత్రమే ముఖ్యం, ప్రజలు ముఖ్యం కాదు. అసెంబ్లీ సమావేశాలతో ప్రభుత్వం సాధించేది ఏంటి..? అని వివేకానంద నిలదీశారు.
ఏరియల్ వ్యూను సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలకు వాడుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారశైలి వింతగా ఉంది. వరదలకు రేవంత్ రెడ్డి హారతి పడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడానికి వెళ్లిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై బురదజల్లే ప్రయత్నం చేశారు. ఓయూ పర్యటనలోను కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి బురదచల్లారు. అసెంబ్లీలో ఎలాంటి చర్చకు అయినా బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ అంశంలో కమిషన్ వేసి తోకముడుచుకుంది. ఫార్ములా ఈ కార్ రేస్‌పై అసెంబ్లీలో చర్చ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తే ప్రభుత్వం పారిపోయింది. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మైక్ కట్ చేస్తున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మైక్ కట్ చేయకుండా అవకాశం ఇవ్వాలి. అసెంబ్లీలో ప్రభుత్వం బట్టలు విప్పేందుకు బిఆర్ఎస్ సిద్ధంగా ఉంది. యూరియాతో రైతులు, వరదలతో ప్రజలు రోడ్డు మీద ఉన్నారు. ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీపై ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొంటాం. ప్రభుత్వానికి కోర్టుల్లో చివాట్లు ఎదురవుతున్నాయి అని వివేకానంద తెలిపారు.