MLA Sabitha | షాబాద్/మొయినాబాద్, ఏప్రిల్ 12 : తెలంగాణలో కేసీఆర్ పేరును చేరివేయడం రేవంత్‌రెడ్డి తరం కాదని.. సూర్యచంద్రులు ఉన్నంతకాలం, తెలంగాణ పదం వినిపిస్తున్నంతకాలం కేసీఆర్‌ను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పట్లోళ్ళ సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం రంగారెడ్డిజిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ మండలంలోని స్టార్ కన్వెన్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు దారెడ్డి వెంకట్‌రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సబితారెడ్డి కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు.
ఈ నెల 27వ తేదిన వరంగల్‌లో బీఆర్ఎస్ పార్టీ 25 ఏళ్ల పండుగ జరుపుకుంటున్నామని తెలిపారు. పార్టీ అధినేత కేసీఆర్ 24 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన పార్టీ ఇప్పుడు 25 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అందరిని బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, కేసీఆర్ అభిమానులందరితో కలిసి కార్యక్రమాన్ని చేసుకోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్న సందర్భంలో అందరికి ఒక దశ, దిశా నిర్దేశాన్ని ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ ఏం చేశారని కొందరూ మూర్ఖులు మాట్లాడుతుంటారని, కానీ తెలంగాణ రావడానికి 14 సంవత్సరాలు ఏ విధంగా కష్టపడ్డారనే దానికి కేసీఆర్‌తో పాటు ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆ కష్టం తెలుసునన్నారు. అ సమయంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారని, కసిగా పనిచేసి రాష్ట్రాన్ని సాధించిన్నట్లు చెప్పారు. ఇప్పుడు మాట్లాడుతున్న వారందరికి కేసీఆర్ ఏం చేశారు.. 14 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం ఏట్ల నడిపించారు.. పదేళ్లు పాలన ఏట్ల చేశారని ఖచ్చితంగా ఇదంతా బేరీజు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
కేసీఆర్ ఏం చేసిండు.. రేవంత్‌రెడ్డి ఏం చేస్తుండో ప్రజలకు క్లియర్ కట్టుగా అర్థమైపోయిందన్నారు. పది సంవత్సరాలు కేసీఆర్ పాలన చూసినాం.. ఏడాదిన్న రేవంత్‌రెడ్డి పాలన చూస్తున్నాం.. సంవత్సరం నుండి ఎవరిని కదిలించినా కేసీఆర్‌ను ఓడగొట్టుకుని తప్పు చేశామని, ఏ గ్రామానికి వెళ్లి ఎవరిని అడిగినా ఇదే మాట చెబుతున్నారని తెలిపారు. ప్రతి పనిలో కేసీఆర్ కనిపిస్తున్నాడని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు వేయడం లేదని, రెండు విడతలు రేవంత్‌రెడ్డి రైతుబంధు ఎగ్గొట్టాడని, కేసీఆర్ ఉంటే అదునుకు డబ్బులు వేసేవాడని ప్రతి రైతు గుర్తు చేసుకుంటున్నారన్నారు. ప్రొద్దున లేవగానే తాగేందుకు గ్లాస్లో నీళ్లు పట్టుకోగానే మిషన్ భగీరథ పథకాన్ని తీసుకువచ్చిన కేసీఆర్ కనిపిస్తాడని తెలిపారు. ఊర్లలో కనిపించే చెట్లను చూస్తే కేసీఆర్ తీసుకువచ్చిన హరితహారం గుర్తుకు వస్తుందన్నారు. గ్రామాల్లో ఎక్కడ చూసిన కేసీఆర్ చేసిన పనులే కనిపిస్తుయని చెప్పారు. రేవంత్‌రెడ్డి ప్రొద్దున లేసి ఏం మాట్లాడుతున్నాడంటే కేసీఆర్ నిషాను చెరిపివేస్తామని అంటున్నాడని, అది ఆయనకు సాధ్యం కాదన్నారు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం, తెలంగాణ పదం వినిపిస్తున్నంతకాలం కేసీఆర్‌ను ఎప్పటికీ మరిచిపోరని చెప్పారు.
27వ తేదీన వరంగల్ బీఆర్ఎస్ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని సూచించారు. మనం ఇంట్లో పండుగ చేస్తే ఏట్లగయితే అందరిని మనవాళ్లని పిలుచుకుంటామో, అదే మాదిరిగా ఈ కార్యక్రమానికి కూడా ఊర్ల ప్రతి ఒక్కరికి పిలవాలని సూచించారు. సీనియర్లు, యువత, కేసీఆర్ అభిమానులను తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. మీటింగ్‌కు తరలివెళ్లే సమయంలో పండుగ వాతావరణంలో తరలివెళ్లాలన్నారు. వాహానాల్లో ఎక్కేటప్పుడు పండుగ వాతావారణంలో బ్యాండు మేళాలతో ర్యాలీగా వెళ్లి వాహానాల్లో ఎక్కాలన్నారు. ప్రతి బస్సుకు ఆయా గ్రామాలకు సంబంధించిన పేర్లతో ప్లెక్సీ ఏర్పాటు చేసుకుని, దానిపై బస్సు డ్రైవర్ ఫోన్ నంబర్ వేయించాలన్నారు. సుమారు 10లక్షలకు పైగా జనాలు వరంగల్ సభకు రానున్నారని, 1200 ఎకరాల్లో సభ ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఉదయం ప్రతి గ్రామం నుండి పార్టీ జెండావిష్కరణ చేయాలని, ప్రేమతో, అభిమానంలో జెండాలు ఆవిష్కరించాలని సూచించారు. కార్యకర్తలకు సంబంధించి ప్రతి బస్సుల్లో తాగునీరు, భోజనం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. చేవెళ్ల నియోజకవర్గంలోని ఐదు మండలాల నుండి 100 బస్సులు, 300 కార్లలో కార్యకర్తలు తరలిరావాలని, అంతకు ఎక్కువ సంఖ్యలోనే జనాలు వచ్చేటట్లు చూడాలన్నారు. ఎక్కడ పోయిన కూడా చేవెళ్లకు ఒక ప్రాధాన్యత ఉంటుందని, అందుకు అనుగుణంగా బీఆర్ఎస్ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఆయా మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించుకుని, సీనియర్లు అందరూ ఒకచోట కూర్చుని వాల్‌పోస్టర్లు విడుదల చేయాలన్నారు. అదే విధంగా ప్రతి గ్రామంలో గోడలపై వాల్రైటింగ్కు రాయించాలన్నారు. సోషల్ మీడియా వాళ్లు కూడా బాగా యాక్టివ్‌గా పనిచేయాలన్నారు.
పెద్ద ఎత్తున తరలివెళ్దాం: పట్నం అవినాశ్‌రెడ్డి
మనం కష్టపడి గెలిపించిన వాళ్లే, మన బీఆర్ఎస్ కార్యకర్తలను బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టిన భయపడేది లేదు. వెళ్లిపోయిన వాళ్ల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్కు కార్యకర్తలు గట్టిగా ఉన్నారు. 27న జరిగే వరంగల్ సభకు చేవెళ్ల నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున తరలివెళ్లి కేసీఆర్‌కు అండగా నిలుద్దాం.
ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఏర్పడింది: కొంపల్లి అనంతరెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఏర్పడింది. ఇచ్చిన ఏ హామీ కూడా సక్రమంగా అమలు చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణను కేసీఆర్ అన్ని రంగాలలో అభివృద్ధి చేశారు. వరంగల్ సభకు ప్రతి గ్రామం నుండి కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివెళ్దాం. రానున్న రోజుల్లో ఎంపీటీసీ, సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పేందుకు అందరం సిద్ధంగా ఉండాలి.
ఈ కార్యక్రమంలో డీసీఎంఏస్ చైర్మన్ పట్ళోళ్ళ కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పట్నం అవినాశ్‌రెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు స్వప్న, తెలంగాణ ఉద్యమకారుడు దేశమళ్ళ ఆంజనేయులు, కనీస వేతనాల మాజీ చైర్మన్ నారాయణ, శంకర్పల్లి మాజీ ఎంపీపీ గోవర్దన్‌రెడ్డి, మొయినాబాద్ మాజీ ఎంపీపీ జయవంత్, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు దారెడ్డి వెంకట్‌రెడ్డి, గూడూరు నర్సింగ్‌రావు, పెద్దోళ్ళ ప్రభాకర్, గోవర్దన్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, మార్కెట్ కమిటీల మాజీ చైర్మన్లు నక్క శ్రీనివాస్‌గౌడ్, పాపారావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు మొర శ్రీనివాస్, కొత్త నర్సింహారెడ్డి, ఎంఏ రావుఫ్, కొలన్ ప్రభాకర్‌రెడ్డి, సుధాకర్‌యాదవ్, గణేష్‌రెడ్డి, షేక్ మహబూబ్, రవియాదవ్, నర్సింహాగౌడ్, సురేందర్‌గౌడ్, జగన్మోహన్రెడ్డి, చాంద్‌పాషా, దారెడ్డి శోభారెడ్డి, ముదిగొండ మంజుల, సూద యాదయ్య, రాఘవరెడ్డి, మహేందర్‌రెడ్డి, మాణిక్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, డప్పు రాజు, కృష్ణారెడ్డి, ర్యాకల శేఖర్, కుమ్మరి రాము, రాంరెడ్డి, తిరుపతిరెడ్డి, విష్ణుగౌడ్, మల్లారెడ్డి, దర్శన్, అంజయ్యగౌడ్, సుభాష్, చెన్నయ్యయాదవ్, రాజుగౌడ్, పరమేశ్, షాబాద్ ప్రవీణ్, గోపాల్, రవీందర్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రమేశ్చారీ, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.