MLA Sabitha | బడంగ్‌పేట, ఫిబ్రవరి 20 : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం తన ప్రాణాలను బలిదానం చేసుకున్న సిరిపురం యాదయ్య త్యాగాన్ని వెలకట్టలేమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం మండల పరిధిలోని నాగారంలో ఉద్యమకారుడు సిరిపురం యదయ్య 15వ వర్ధంతి సందర్బంగా ఆయన సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ కోసం అగ్నికి అహుతి అయిన సిరిపురం యాదయ్య త్యాగాన్ని తెలంగాణ ప్రజలు మర్చిపోలేరన్నారు. యాదయ్య మరణంతో తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినట్లు అయ్యిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇక రాదేమోనన్న బాధతో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మబలిదానం చేసుకోవడం జరిగిందన్నారు. యాదయ్య మరణించినా ఆయన ఆశయాలు ఉన్నాయన్నారు. యాదయ్య కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. త్యాగధనుల కుటుంబాలను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారులకు అన్ని విధాల న్యాయం చేశారని గుర్తు చేశారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ మంచే పాండు యాదవ్, మాజీ సర్పంచ్ రాజేష్, కృష్ణ, సంజీవ్, మాజీ ఎంపీటీసీలు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.