MLA Sabitha | హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో బీహార్‌లో కోట్ల రూపాయలతో కాంగ్రెస్ ప్రకటనలు ఇస్తుంది. తెలంగాణ రైతులకు, ప్రజలకు, ఉద్యోగులకు, విద్యార్థులకు సంక్షేమ పథకాలు అందించేందుకు మాతరం డబ్బులు లేవు. కానీ వేరే రాష్టాల్లో కోట్ల రూపాయలతో ప్రకటనలకు సర్కార్ సొమ్ము ఖర్చు చేస్తున్నారని సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు.
నాడు పాఠశాలలు మొదలైన నాడే పాఠ్యపుస్తకాలు ఇచ్చిన ఘనత నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. కాంగ్రెస్ పాలనలో పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా పాఠ్యపుస్తకాల జాడలేదన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భోజనానికి పైసలు లేవు. కేజీబీవీలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలకు నిధులు లేవు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం ఎక్స్-రే మిషిన్లు రిపేర్ చేయించడానికి డబ్బులు లేవు. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి రూపాయలు లేవు. తెలంగాణ రాష్ట్రంలోని పత్రికలకు, జర్నలిస్టుల సంక్షేమానికి నిధులు లేవు. కానీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కోట్ల రూపాయల తెలంగాణ ప్రజల సొమ్మును బీహార్ ఎన్నికల ప్రకటనల కోసం రేవంత్ సర్కార్ ఖర్చు చేస్తుందని ఎమ్మెల్యే సబిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.