MLA Sabitha | హైదరాబాద్ : రుద్రమదేవి, సమ్మక్క సారాలక్క లాంటి వీర వనితలు పుట్టిన నేలపై తెలంగాణ ఆడబిడ్డలకు ఘోర అవమానం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అందాల పోటీలకు వచ్చిన యువతుల కాళ్లను వరంగల్ మహిళలతో రాష్ట్ర ప్రభుత్వం కడిగించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై సబితా ఇంద్రారెడ్డి సీరియస్‌గా స్పందించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆడబిడ్డల పరువు తీసింది.తెలంగాణ రాష్ట్రమే కాదు, భారత దేశ మహిళల పరువును ప్రపంచం ముందు తీసిన సంఘటన ఇది. వీర వీరవనితలు రాణి రుద్రమదేవి, సమ్మక్క – సారలమ్మలు పుట్టిన నేలపైనే ఈ ఘోర అవమానం జరగడం చాలా బాధాకరం. తెలంగాణ ఆడబిడ్డలతో మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడిగించడం, తుడిపించడం దుర్మార్గమైన,అవమానకరమైన,అత్యంత హీనమైన చర్య..యావత్ మహిళ లోకానికి ఈ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి అని సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని, తమ కాళ్ళ మీద తాము నిలబడేలా చేసి మహిళల ఆత్మ గౌరవాన్ని పెంచుతామని గొప్పగా చెప్పే ప్రభుత్వం విదేశీయుల కాళ్ళు కడిగించటం ద్వారా ఏ సంకేతాలు ఇస్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలోని మహిళలు తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం నడుస్తుంటే, మరోవైపు విదేశీ అందగత్తెలకు తమ కాళ్లు కడిగి, టవల్‌తో తుడిపించడం దేనికి సంకేతం ఇస్తుంది అని ఆమె ప్రశ్నించారు.
గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మిషన్ భగీరథతో మహిళల నీటి కష్టాలు తీరిస్తే, నేడు బిందెలా కష్టాలు తెచ్చి పాత రోజులు తెచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికే దక్కుతుంది. కానీ ఆడబిడ్డల గౌరవాన్ని తగ్గించిన ఏ ఒక్కరు కూడా బాగుపడినట్టు చరిత్రలో లేదు. అదేవిధంగా మహిళల ఉసురు తగిలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా పతనం అవ్వటం ఖాయం అని ఎమ్మెల్యే సబిత హెచ్చరించారు.