MLA Prashanth Reddy | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ రాజకీయాల్లో అరుదైన నాయకుడు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కొనియాడారు. అసెంబ్లీలో మాగంటి గోపీనాథ్ సంతాప తీర్మానం సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు.
మాగంటి గోపీనాథ్ మన మధ్య లేకపోవడం చాలా బాధకరం. వారు, నేను ఒకేసారి 2014లో ఈ సభలోకి అడుగుపెట్టాం. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈ సభలో వారితో కలిసి పని చేశాం. వారు చాలా మృదుస్వభావి. వివాదాలకు దూరంగా ఉండేవారు. 35 ఏండ్ల క్రితం మాగంటి గోపీనాథ్ నాకు పరిచయం. మా కుటుంబం, మా తండ్రి టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. అప్పట్నుంచి గోపీనాథ్‌తో సంబంధాలు ఉన్నాయని ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు.
గోపీనాథ్ ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి నమ్మకంగా పని చేసేవారు. పార్టీ నాయకుడికి విధేయుడిగా ఉన్నారు. ఎన్టీఆర్, కేసీఆర్‌కు నమ్మకంగా పని చేశారు. ఒక రాజకీయ నాయకుడికి నిబద్ధదతో పని చేయడం, ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పడరుచుకోవడం ముఖ్యం. కానీ ఈ రెండు లక్షణాలు చాలా మంది నాయకులకు ఉండవు. ఈ రెండు లక్షణాలు కొందరిలోనే ఉంటాయి.. అలాంటి అరుదైన వ్యక్తుల్లో గోపీనాథ్ ఒకరు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఎన్టీఆర్‌తో అంటిపెట్టుకుని ఉన్న నాయకుల్లో గోపీ ఒకరు. అధికారం కోల్పోయిన తర్వాత ఎన్టీఆర్ నాచారం స్టూడియోలో ఉండేవారు. చాలా తక్కువ మంది అక్కడికి వెళ్లేవారు. గోపీతో పాటు కొంత మంది ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లేవారు. ఆ రోజుల్లో కలిసి ఉన్న వ్యక్తులం, ఆలోచనలు పంచుకున్న వ్యక్తులం. అధికారం కోల్పోయిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీకి నిబద్ధతగా పని చేశారు. ఆ విధంగానే జూబ్లీహిల్స్ ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పారు. మూడుసార్లు గెలవడం అంటే అంత ఈజీ కాదు. ప్రజా నాయకుడిగా నిలదొక్కుకున్నారు. ఆయన చిరస్మరణీయుడు. ఆయన లేని లోటును నియోజకవర్గ ప్రజలకు తీర్చే విధంగా పార్టీ అండగా ఉంటుంది. వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం పరుస్తున్నాం అని వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.