హైదరాబాద్, జనవరి 29 (నమస్తే తెలంగాణ): పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో తమపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఆయన భార్య నీలిమతోపాటు జీ మధుకర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ పంచాయతీ కొర్రెములలోని ప్లాట్లలోకి తాము అక్రమంగా చొరబడినట్టు ముచ్చర్ల రాధిక అనే మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ నెల 23న పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. సివిల్ వివాదంపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని తప్పుపట్టారు. ఈ కేసు నమోదు వెనుక రాజకీయ కుట్ర ఉన్నదని ఆరోపించారు. గాయత్రి ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ ట్రస్టుకు సంబంధించిన భూమి మ్యుటేషన్ జరగడంతో సివిల్ కోర్టు డిక్రీ ద్వారా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అకడి లేఔట్లో 150 చదరపు గజాల ప్లాట్‌ను కొనుగోలు చేసినట్టు ఫిర్యాదుదారు చేస్తున్న వాదనలో నిజం లేదని, అసలు అక్కడ లేఔటే లేదని వివరించారు. భూమి హకులకు సంబంధించిన వివాదం ఉంటే సివిల్ కోర్టులో తేల్చుకోకుండా క్రిమినల్ కేసు పెట్టడం చట్ట వ్యతిరేకమని పేర్కొంటూ.. పోలీస్ కేసును కొట్టేయాలని కోరారు. దీనిపై హైకోర్టు త్వరలో విచారణ జరిపే అవకాశం ఉన్నది.