హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ కార్యకర్త గంగారెడ్డి మర్డర్ విషయంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్‌పై హత్య కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. సంజయ్‌పై జగిత్యాల ఎస్పీ ఎందుకు కేసు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. మారెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం మారు గంగారెడ్డిని తన అనుచరుడితో సంజయ్ హత్య చేయించారని స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ చెప్తున్నారని, ఈ ఆరోపణలను తాను కూడా నమ్ముతున్నానని చెప్పారు. తెలంగాణలో హత్యా రాజకీయాలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. తెలంగాణభవన్‌లో గురువారం బీఆర్ఎస్ నాయకులు బొమ్మెర రామ్మూర్తి, పల్లె రవికుమార్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మారెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్యే సంజయ్ తన అనుచరుడైన నారాయణరెడ్డి పేరును ప్రతిపాదించారని, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తన అనుచరుడైన గంగారెడ్డి పేరు ప్రతిపాదించారని పేర్కొన్నారు.
నారాయణరెడ్డికి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఇప్పించేందుకు సంతోష్ అనే వ్యక్తితో గంగారెడ్డిని హత్య చేయించారని స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే చెప్పినప్పుడు సంజయ్‌పై మర్డర్ కేసు ఎందుకు నమోదు చేయరు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉన్నదా? అని ఫైరయ్యారు. తాను కాంగ్రెస్‌లో చేరలేదంటున్న ఎమ్మెల్యే సంజయ్.. గాంధీభవన్‌లో జరిగిన మీటింగ్‌కు ఎందుకు హాజరయ్యారని, రేవంత్‌రెడ్డి చిత్రపటానికి ఎందుకు పాలాభిషేకం చేశారని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేస్తున్నారని, దాన్ని ఎందుకు అమలుచేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ డబ్బులు ఢిల్లీకి తరలుతాయని నాడు కేసీఆర్ చెప్పినట్టుగానే నేడు వయనాడ్‌కు తరలుతున్నాయని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు.