హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 5 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఇంటిలో స్పృహ తప్పి పడిపోవడంతో కుటుంబసభ్యులు ఆయనను వెంటనే హైదరాబాద్ ఏఐజీ దవాఖానకు తరలించారు. కార్డియాక్ అరెస్ట్‌కు గురైనట్టు గుర్తించి సీపీఆర్ చేయడంతో ఆయన కొద్దిగా కోలుకున్నట్టు ఏఐజీ వైద్యులు తెలిపారు. అనంతరం గుండె నిపుణుల ప్రత్యేక పర్యవేక్షణలో వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు.
ప్రస్తుతం ఎమ్మెల్యే గోపీనాథ్ పరిస్థితి కొంత విషమంగానే ఉన్నదని, 48 గంటలు గడిచేవరకు ఏ విషయం చెప్పలేమని తెలిపారు. గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఎమ్మెల్యే గోపీనాథ్ ఏఐజీలోనే డయాలసిస్ చేయించుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు. మాగంటి అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇతర బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున దవాఖాన వద్దకు చేరుకున్నారు. హరీశ్, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే గోపీనాథ్‌ను పరామర్శించారు.