MLA Arekapudi Gandhi | హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని పోలీసులు గురువారం కొండాపూర్‌లోని ఆయన ఇంట్లో హౌస్ అరెస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా పీఏసీ చైర్మన్‌గా ఎంపికైనట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఇంటి వద్ద బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తానని కౌశిక్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఇంటివద్ద పోలీసులు మోహరించారు. కౌశిక్‌రెడ్డిని బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలను కూడా అనుమతించలేదు.
కౌశిక్‌రెడ్డిని గృహనిర్బంధం చేయడంతో అరికెపూడి రెచ్చిపోయారు. గాంధీ ఫ్యాక్షనిస్టుల తరహాలో భారీ వాహనశ్రేణితో కొండాపూర్‌లోని కౌశిక్‌రెడ్డి నివాసానికి వెళ్లారు. గేటెడ్ కమ్యూనిటీ గేట్ వద్ద స్థానికులను అనుమతించని పోలీసులు గాంధీని, ఆయన అనుచరులను మాత్రం వెళ్లనిచ్చారు. దీంతో యథేచ్ఛగా లోపలికి వచ్చిన రౌడీమూక కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడిచేసినట్టు తెలుస్తున్నది.
గాంధీని సాదరంగా తన ఇంట్లోకి ఆహ్వానించడానికే కౌశిక్‌రెడ్డి సిద్ధమైనట్టు చెప్తున్నారు. బీఆర్ఎస్ మహిళానేతలు కూడా హారతి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. గాంధీని సాదరంగా ఆహ్వానించి, భోజనం పెట్టి, తెలంగాణభవన్‌కు వెళ్లి ప్రెస్‌మీట్ నిర్వహించి, కేసీఆర్ వద్దకు వెళ్లాలని కౌశిక్‌రెడ్డి భావించినట్టు పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. అయినప్పటికీ గాంధీ వ్యూహం ప్రకారం కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేయించారు.