MLA Jagadish Reddy | హైదరాబాద్ జూన్ 24 (నమస్తే తెలంగాణ) : ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై వెళ్లాల్సింది చంద్రబాబుతో చర్చలకు కాదు.. అపెక్స్ కౌన్సిల్‌కు వెళ్లాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో కృష్ణా జలాలను తరలించి అన్యాయం చేసినట్టుగానే గోదావరిని తరలించుకెళ్ళెందుకు ఆంధ్రా సర్కార్ కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. అడ్డుకోవాల్సిన రేవంత్ రెడ్డి చోద్యం చూస్తూ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. బనకచర్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నదని ఆరోపించారు. అందుకే మొన్న జరిగిన కేబినెట్లో సీరియస్ గా చర్చించలేదని ఆక్షేపించారు.. చంద్రబాబు మాయలో పడి రేవంత్ రెడ్డి ఏపీకి నీళ్లు తరలిస్తుంటే అభ్యంతరం చెప్పడం లేదన్నారు.
మంగళవారం తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యేలు భాస్కరరావు, రవీంద్ర కుమార్, మెతుకు ఆనంద్‌తో కలిసి జగదీశ్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదావరిపై ట్రిబ్యునల్ ఏర్పాటు కాకముందుకే జలాలపై హక్కులు సాధించుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.. గోదావరి నీటిని కృష్ణా మీదుగా ఆంధ్రకు తరలించే అవకాశాన్ని వదిలిపెట్టి… రూ. 80 వేల కోట్లతో బనకచర్లను నిర్మించి తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం చేసేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు.. లేని మిగులు జలాల కోసం ఆరాటపడుతూ తెలంగాణను ఎండబెట్టెందుకు కుతంత్రాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. నిలువరించాల్సిన రేవంత్ రెడ్డి గురుదక్షిణగా ఆయనకు దాసోహం అవుతున్నారని ఆరోపించారు. అందుకే అపెక్స్ కౌన్సిల్లో మాట ఎత్తకుండా చంద్రబాబుతో చర్చల పేరిట సంధి కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే అన్ని పార్టీలను కలుపుకొని పోరాటం చేయాలని హితవు పలికారు.
బనకచర్ల విషయంలో ఆంధ్రకు చెందిన ఓ మీడియా వర్గం తెలంగాణ పార్టీల మధ్య పంచాయతీ పెడుతున్నదని జగదీశ్ రెడ్డి ఆరోపించారు. ఈ ముసుగులో గోదావరిని ఆంధ్ర ప్రాంతానికి తరలించే బాబు యత్నానికి మద్దతు పలుకుతున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ, బిజెపి నాయకులు వారి ఉచ్చులో పడవద్దని సూచించారు. బనకచర్లపై అందరం ఏకమై కొట్లాడుదామని పిలుపునిచ్చారు. గోదావరి కావేరి లింకు ముగిసిన అధ్యాయం అని వ్యాఖ్యానించారు. గతంలో చత్తీస్గడ్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించిందని గుర్తు చేశారు. కానీ తెలంగాణ చెందిన బిజెపి ఎంపీలు సోయి లేకుండా చంద్రబాబు మేలు కోసం మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇప్పటికైనా అవగాహన పెంచుకొని తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టవద్దని డిమాండ్ చేశారు. బనకచర్లపై పోరాట విషయంలో బీఆర్ఎస్ అన్ని పార్టీలతో కలిసి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నదని ప్రకటించారు. ఈ దిశగా ప్రభుత్వం కార్యాచరణ తీసుకోకుంటే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.
రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సార్లు రైతుబంధును ఎగ్గొట్టిందని రుణమాఫీ చేయకుండా మోసం చేసిందని జగదీశ్ రెడ్డి దుయ్యబట్టారు. కానీ ఇప్పుడు రైతులకు ఏదో ఉద్ధరించామని సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు. రైతుబంధు కొట్టినందుకు రుణమాఫీ పేరా మోసం చేసినందుకు రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. ప్రభుత్వం రైతులకు లక్ష కోట్లు సాయం చేశాం అనడం దుర్మార్గమన్నారు.. ప్రభుత్వం సాయం చేసింది అధికార పార్టీకి చెందిన కాంట్రాక్టులు నిర్వహించే మంత్రులకేనని ఎద్దేవా చేశారు.