MLA Jagadish Reddy | సూర్యాపేట : బనకచర్ల ప్రాజెక్టుకు వత్తాసు పలికిన రేవంత్ రెడ్డి, బండి సంజయ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రూపంలో మరోసారి తెలంగాణ జలదోపిడికి గురవుతుంది. గతంలో రాజశేఖర్ రెడ్డి కృష్ణాని దోచుకపోతే.. నేడు చంద్రబాబు గోదావరిని దోచుకుంటున్నాడు. కాంగ్రెస్, తెలుగుదేశం రెండూ తెలంగాణకు ద్రోహం చేసిన పార్టీలే. ఆ రెండిటి కలయికలో పుట్టిన హైబ్రిడ్ కలుపు మొక్క రేవంత్ రెడ్డి. అటువంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రి ఉండడం మన దురదృష్టకరం అని మండిపడ్డారు.
ఉన్న తెలంగాణను ఉడగొట్టి ఆంధ్రలో కలిపింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు వందలాది మందిని బలిగోన్నది కూడా కాంగ్రెస్ పార్టీనే. కేసీఆర్ సారధ్యంలో కాంగ్రెస్ పార్టీని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే క్రమంలో ఆనాడు అడ్డుపడ్డది చంద్రబాబు. తెలంగాణలో వలసలు, కరువు కాటకాలు, ఆకలి చావులకు కారణమైంది టిడిపి, కాంగ్రెస్ పార్టీలే. తెలంగాణ ప్రజలు మళ్లీ కరవు కోరలో పడేలా రేవంత్ పాలన కొనసాగుతోందని జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు.
నదులు ఎక్కడ ఉన్నాయో తెలియని రేవంత్.. ఇక్కడ దేనినైనా అమ్మడానికి వెనకాడట్లేదు. తన స్వార్థం కోసం ఎంతటి దుర్మార్గానికైనా దిగజారుతున్న నాయకుడు రేవంత్ రెడ్డి. కృష్ణ ఎప్పుడో కృష్ణార్పణం.. ఆంధ్రార్పణం అయింది.. 350 టీఎంసీల ప్రాజెక్టును కట్టి రాజశేఖర్ రెడ్డి దుర్మార్గంగా కృష్ణా నీళ్లను తీసుకుపోతుంటే ఆనాటి కాంగ్రెస్, టిడిపి నాయకులు నోరు మెదపలేదు. ఈనాడు గోదావరిని కూడా దోచుకుపోతుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి కూడా నోరు మెదపరిని దుస్థితి. మన నీళ్లు మనం వాడుకోవడానికి చంద్రబాబు అనుమతి అవసరమా..? రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకోవడం కోసం తెలంగాణ మొత్తం దోచుకుపోయినా స్పందించడా..? ఈ దారుణాన్ని బిఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సహించడు.. కేసీఆర్ మరో ఉద్యమం చేస్తే తప్ప తెలంగాణ జలదోపిడిని ఆపలేం అని జగదీశ్ రెడ్డి చెప్పారు.
ఏడాదిన్నర పాలనలో ఒక్కరోజు కేసీఆర్ పెట్టిన సభతోనే కాంగ్రెస్ పార్టీలో వణుకు మొదలైంది. తెలంగాణ హక్కుల్ని ఆంధ్రకు అమ్ముతుంటే కేసీఆర్ చూస్తూ కూర్చోడు. హక్కుల సాధనలో తెలంగాణ ప్రజల తిరుగుబాటును చరిత్ర ఏనాడో చూసింది. గొప్ప గొప్ప నియంతలే మట్టి కరిచారు. కుక్కమూతి పిందెలు తెలంగాణ చైతన్యం ముందట నిలబడలేవు. రేవంత్ బాసుల మెడలు వంచే కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు. మోడీ, చంద్రబాబు, రేవంత్‌ల కుట్రలను తిప్పి కొట్టి తెలంగాణ హక్కులను కాపాడటంలో బీఆర్ఎస్ ముందుంటది. కేసీఆర్ ఉండగా తెలంగాణ ప్రజలకు నష్టం కలగనివ్వడు.. ప్రజలందరినీ ఐక్యం చేసి రాష్ట్ర సాధన ఉద్యమాన్ని తలపించేలా మరో ఉద్యమం తప్పదు అని మాజీ మంత్రి హెచ్చరించారు.
కృష్ణా, గోదావరి నదుల్లో మనకున్న వాటాను కేసీఆర్ తప్పకుండా కాపాడుతాడు.. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ మరో పోరాటానికి సిద్ధమైతది. అభివృద్ధిలో అన్ని ప్రతిపక్షాలను కలుపుకొని పోతే తప్ప పాలించడం మీ వల్లకాదు. ప్రాంతీయేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం అవతలికి ప్రారద్రోలదాం.. ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ఇక్కడనే పాతిపెడదామన్న కాళోజీ మాటలను తెలంగాణ నిజం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ఉన్నారు. రేవంత్ నాటకాన్ని.. చంద్రబాబు ద్రోహాన్ని బయటపెట్టి తెలంగాణ హక్కుల్ని కాపాడుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
బండి సంజయ్, రేవంత్ రెడ్డి వీళ్లంతా తెలంగాణ ద్రోహులే.. వీళ్లలో ఏ ఒక్కడికి తెలంగాణ ప్రజల పట్ల, అభివృద్ధి పట్ల సోయి లేదు. ఈ దేశంలో జాతీయ పార్టీలు ఎప్పుడూ తెలంగాణకు న్యాయం చేయలేదు. ఆ తర్వాత వచ్చిన తెలుగుదేశం పార్టీ ఇంకా పెద్ద ద్రోహం చేసింది. తెలంగాణ హక్కుల్ని, అస్తిత్వాన్ని కాపాడింది కేవలం బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మాత్రమే. బిజెపికి ఎనిమిది మంది ఎంపీలను ఇస్తే మనకిచ్చిన రిటర్న్ గిఫ్టు బనకచర్ల రూపంలో చంద్రబాబుకు గోదారి నీళ్లను దోచిపెట్టడం. బిజెపి, కాంగ్రెస్ వాళ్ళకు పదవుల సోయి తప్ప తెలంగాణ ప్రజల పట్ల సోయున్న వాళ్ళెవరూ లేరు. కేసీఆర్‌ని జైల్లో పెట్టేందుకు కాంగ్రెస్, బిజెపి ఒకల్ని మించి మరోకరు పోటీ పడుతున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కేసీఆర్‌ని జైల్లో పెట్టడం ఎవరి తరం కాదు. 11 ఏళ్ల నుంచి ఈడీ, ఐటీ, ఏసీబీ, సిఐడిలు కేసీఆర్ పై డేగ కళ్ళు వేసుకొని చూసినయి. అందరి కుట్రలను తిప్పికొట్టి తెలంగాణను దేశంలోనే నెంబర్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసిఆర్‌ది. ఎప్పటికైనా కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష. ఇప్పటికే బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారిపైనా మూడున్నర వేలకు పైగా కేసులు పెట్టిండ్రు. ఎవరెన్ని కుట్రలతో కేసులు పెట్టినా భయపడేది లేదు. కేసీఆర్ నాయకత్వంలో ప్రజలందరి చైతన్యంతో మరో ఉద్యమం తప్పదు అని జగదీశ్ రెడ్డి హెచ్చరించారు.