Harish Rao | తెలంగాణ శాసనసభ దుశ్శాసనభగా మారిందని బీఆర్ఎస్ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. సభ్యసమాజం తలదించుకునే విధంగా శాసనసభలో వ్యవహారాలు నడుస్తున్నాయని విమర్శించారు. జాబ్ క్యాలెండర్లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేశారని హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ఆయన నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దానం నాగేందర్ అసభ్య పదజాలంతో మాట్లాడటంపై ధ్వజమెత్తారు.
ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు దక్కే గౌరవం ఇదేనా అని హరీశ్ రావు ప్రశ్నించారు. నిన్న మహిళా శాసనసభ్యులను పట్టుకుని నోటితో ఉచ్ఛరించలేని భాషలో ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి మాట్లాడారని గుర్తుచేశారు. నిన్న మహిళా ఎమ్మెల్యేలను అవమానపరిచారని… ఇవాళ ఈ దేశంలోని మహిళామూర్తులు, కన్నతల్లులను అవమానపరిచేలా శాసనసభలో సభ్యులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సభా నాయకుడే సభలో ఉండి ఈరకంగా బీఆర్ఎస్ పార్టీని, ఎమ్మెల్యేలను తిట్టించే ప్రయత్నం చేయడం ఏరకంగా సమంజసమని ప్రశ్నించారు.
అది మనుషులు మాట్లాడే భాష కాదు పశువులు మాట్లాడే భాష అని దానం నాగేందర్‌పై హరీశ్‌రావు మండిపడ్డారు . ఒక రౌడీ షీటర్లు బయట మాట్లాడే భాషను శాసనసభ్యుడు సభలో మాట్లాడటం తగునా అని ప్రశ్నించారు. దీనికి స్పీకర్ ఎందుకు మైక్ కట్ చేయరు? దీన్ని సభా నాయకుడు ఏరకంగా ఎంకరేజ్ చేస్తారని ప్రశ్నించారు. తాము ఎప్పుడైనా ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శిస్తే.. తప్పులు ఎత్తిచూపితే కొన్ని సెకన్లలోనే తమ మైకులు కట్అవుతున్నాయని చెప్పారు. కానీ ఆ సభ్యుడు మాత్రం నోటికొచ్చినట్లుగా కన్నతల్లులను అవమానపరిచేలా మాట్లాడినా ఎందుకు మైక్ కట్ చేయట్లేదని నిలదీశారు. అవసరమైతే శాసనసభ్యులను సభ నుంచి బహిష్కరిస్తామని నిన్న ముఖ్యమంత్రి అన్నారని గుర్తుచేశారు. ఇవాళ రౌడీ భాషను మాట్లాడిన ఈయన్ను బహిష్కరించకూడదా? అని నిలదీశారు. ఒక రౌడీ భాషను మాట్లాడుతుంటే, మాతృమూర్తులను అవమానిస్తుంటే స్పీకర్ మైక్ కట్ చేయడు.. సభానాయకుడు ఖండించడు.. పైగా ముసిముసి నవ్వులు నవ్వుతుంటాడని మండిపడ్డారు. నిజంగా మీకు మాతృమూర్తుల మీద, మహిళల మీద గౌరవం ఉంటే తక్షణమే ఆ శాసనసభ్యుడిని బహిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఇదేమీ రాజ్యమో అర్థం అవ్వట్లేదని హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. నిన్న మహిళా ఎమ్మెల్యేలను అవమానపరిచారని.. ఇవాళ మాతృమూర్తులను అవమానపరిచారని అన్నారు. మాతృత్వ విలువ తెలియని వాళ్లే ఈ రకంగా మాట్లాడతారని మండిపడ్డారు. ఇది మంచి పద్ధతి కాదని.. ఇప్పటికైనా ఆ సభ్యుడిని ఎక్స్పెల్ చేయాలని డిమాండ్ చేశారు. తల్లులు, మహిళల గురించి ఈరకంగా మాట్లాడుతుంటే కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
సభను నడిపే తీరు ఇదేనా.. మన పిల్లలకు ఇదేనా నేర్పించేది అని హరీశ్‌రావు మండిపడ్డారు. ఈ భాషను చూసి మన పిల్లలు ఏమనుకుంటారని ప్రశ్నించారు. తెలంగాణ శాసనసభ పరువు, ప్రతిష్టను మంటగలిపారని, తెలంగాణ శాసనసభ గౌరవాన్ని తలదించుకునేలా ఈ రోజు శాసనసభ నడుస్తుందని మండిపడ్డారు. ఇది చాలా దుర్మార్గమైన భాష అని అన్నారు. దీన్ని శాసనసభలో ఎంకరేజ్ చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగా మేం ఆరకంగా చేసి ఉంటే ఇవాళ ఒక్క కాంగ్రెస్ సభ్యుడైనా మిగిలి ఉండేవాళ్లా? అని అడిగారు. మేం ఆరకంగా చేశామా? ఆ సంస్కృతిని మేం ఎంకరేజ్ చేశామా? అని ప్రశ్నించారు.
గతంలో ఇదే శాసనసభ్యుడు తెలంగాణ ఉద్యమం మీద మాట్లాడి నాలుక కరుచుకుని క్షమాపణ చెప్పారని హరీశ్‌రావు గుర్తుచేశారు. మళ్లీ ఈ రోజు అదే భాష మాట్లాడారని అన్నారు. భగవంతుడు ఉన్నారు.. ప్రజలు ఉన్నారని.. తప్పకుండా అతనికి తగిన శాస్తి జరుగుతుందని వ్యాఖ్యానించారు. ఆ శాస్తి జరిగే దాకా కూడా వదిలిపెట్టమని స్పష్టం చేశారు. ఆ శాసనసభ్యుడి మీద అనర్హత వేటు వేసేది ఖాయమని.. రేపు ఆయన మాజీగా మిగలడం తప్పదని అన్నారు.