హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): భువనగిరి ఎస్సీ గురుకుల పాఠశాలలో విద్యార్థి ప్రశాంత్ మృతి తీవ్రంగా కలచివేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ విద్యార్థి.. ప్రభుత్వ అసమర్థత వల్ల మరణించటం దురదృష్టకరమని బుధవారం ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ పాలనలో ఘనకీర్తి సాధించిన తెలంగాణ గురుకులాలు ఇప్పుడు తల్లిదండ్రులు, విద్యార్థుల నమ్మకాన్ని కోల్పోతున్నాయి. వరుస ఆత్మహత్యలు, ఫుడ్ పాయిజన్ సంఘటనల వల్ల గురుకులాల ప్రతిష్ఠ దిగజారుతున్నది. ప్రజాపాలన అంటూ ప్రతీకార పాలన చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి గురుకులాల్లో చదువుకుంటున్న పేదబిడ్డల సంక్షేమం గురించి కనీస ఆలోచన లేదు. ప్రశాంత్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించి బాధిత కుటుంబానికి రూ.50 లక్షల నష్టపరిహారం అందించాలి. ఇలాంటివి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు.
రాష్ట్రం గొంతెండుతున్నది
తెలంగాణ గొంతు ఎండిపోతున్నదని, గుకెడు మంచి నీళ్లకోసం ప్రజలు రోడ్డెక్కుతున్నారని హరీశ్‌రావు తెలిపారు. ఖాళీ బిందెలతో ధర్నాలు చేస్తున్నారని, ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తున్నారని వెల్లడించారు. సమైక్య పాలనలోని నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇలాంటి దుస్థితి ఎన్నడూ లేదని, మారుమూల తండాల్లోనూ మిషన్ భగీరథ జలధార సమృద్ధిగా వచ్చేదని గుర్తుచేశారు. పంటలకు సాగునీళ్లు ఎలాగూ ఇవ్వని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం.. కనీసం గొంతు తడుపుకోవటానికైనా మంచినీళ్లు ఇవ్వాలని కోరారు.