Harish Rao | కాంగ్రెస్‌ను నమ్మి అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం రోడ్డున పడి అలమటించాల్సిన పరిస్థితి తెచ్చారని బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల డిమాండ్లపై సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. గ్రూప్ 1, డీఎస్సీ తదితర ఉద్యోగాల కోసం చేపట్టిన నియామక ప్రక్రియ కూడా ఉద్యోగార్థులకు చాలా ఇబ్బందికరంగా మారిందని హరీశ్‌రావు తెలిపారు. గ్రూప్-1 ఉద్యోగాలకు 1: 100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని కోరారు. గ్రూప్2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం వెంటనే రెండు లక్షల ఉద్యోగాలను గుర్తించి జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతిని కూడా వెంటనే చెల్లించాలన్నారు.
గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళన, ఆవేదనను కాంగ్రెస్ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని ఆశించామని, కేబినెట్ సమావేశంలో వారికి న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటుందని ఎదురుచూశామని తెలిపారు. కానీ అందరి ఆశలు అడియాశలు చేసేలా, నిరాశలోకి నెట్టేసేలా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, సమస్యల గురించి ఎలాంటి చర్చ లేకుండానే కేబినెట్ సమావేశాన్ని ముగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాది నుంచే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని హరీశ్‌రావు గుర్తు చేశారు. నిరుద్యోగులకు నెలకు రూ.4వేల నిరుద్యోగ భృతి ఇస్తామని మాట ఇచ్చారని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వివిధ శాఖల్లో 1.60లక్షల ఉద్యోగాలు భర్తీ చేసినప్పటికీ, కాంగ్రెస్ పార్టీ అంతకన్నా ఎక్కువ ఉద్యోగాలు ఇస్తుందని నమ్మి మీకు ఓటేశారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పటికి ఆరు నెలలు దాటిందని.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు సంబంధించి నియామక పత్రాలు ఇచ్చారు తప్ప.. కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్‌ను నమ్మి అధికారంలోకి తీసుకొచ్చిన నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం రోడ్డున పడి అలమటించాల్సిన పరిస్థితి తెచ్చారని అన్నారు.
గ్రూప్ 1, డీఎస్సీ తదితర ఉద్యోగాల కోసం చేపట్టిన నియామక ప్రక్రియ కూడా ఉద్యోగార్థులకు చాలా ఇబ్బందికరంగా మారిందని హరీశ్‌రావు తెలిపారు. కనీసం వారు చేస్తున్న విజ్ఞప్తిని వినే పరిస్థితిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోవడం శోచనీయమని అన్నారు. బాధ్యతగల ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉద్యోగార్థులకు సంబంధించిన కొన్ని కీలకమైన సమస్యలను, బాధలను, వినతులను మీ దృష్టికి తీసుకొస్తున్నామని అన్నారు. వెంటనే ఈ అంశాలపై దృష్టిపెట్టి తగు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏడు విజ్ఞప్తులు చేశారు.
హరీశ్‌రావు లేఖలోని ఏడు డిమాండ్లు..
1.గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 503 ఉద్యోగాల భర్తీ కోసం గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది. మీరు వాటికి మరో అరవై ఉద్యోగాలు చేర్చి మొత్తం 563 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్ వేసారు. అభ్యర్థులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మెయిన్స్‌కు 1 : 50 నిష్పత్తిలో కాకుండా, 1 : 100 నిష్పత్తిలో అభ్యర్థులను అనుమతించాలని కోరుతున్నాను. 1: 100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయడం కొత్తేమీ కాదు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షకి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించిన గ్రూప్ 2 నోటిఫికేషన్లో 1:15 గా పేర్కొన్నప్పటికీ, తదనంతరం అభ్యర్థుల కోరిక మేరకు 1:100 నిష్పత్తిలో మెయిన్స్‌కి ఎంపిక చేశారు. గ్రూప్ 1 పరీక్ష అనేది యు.పి.ఎస్.సి. మాదిరిగా ప్రతి సంవత్సరం ఉండదు. రాష్ట్ర స్థాయి సివిల్స్ పరీక్ష కావడం వల్ల ఆశావహుల సంఖ్య పెరిగింది. 1:100 నిష్పత్తిలో మెయిన్స్‌కి ఎంపిక చేయడం వల్ల తెలంగాణ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తాము కలలు కన్న గ్రూప్ 1 ఉద్యోగాలను సాధించే అవకాశాలు పెరుగుతాయి. దీనివల్ల ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదు.
నేడు ఉపముఖ్యమంత్రిగా మీ ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీ భట్టి విక్రమార్క గారు గతంలో కాంగ్రెస్ శాసన సభాపక్ష నాయకునిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ కు 1 :100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని అసెంబ్లీ వేదికగా డిమాండ్ చేసారు. ఇప్పుడు ఆ వైఖరి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎందుకు తప్పుకుంటున్నదో అర్థం కావటం లేదు. ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు. గతంలో మీరు చేసిన డిమాండ్‌ను అమలు చేయగలిగే అవకాశం మీకిప్పుడు ఉంది కానీ ఎందుకు చేయలేకపోతున్నారు ? ప్రతిపక్షంలో ఉంటే ఒకమాట ఆధికారంలో ఉంటే వేరొకమాటగా ప్రవర్తించడం ఎందుకు ? గతంలో మీరు ప్రకటించిన వైఖరికి కట్టుబడి మెయిన్స్‌కు 1:100 చొప్పున ఎంపిక చేసి ఉద్యోగార్థులకు తగిన న్యాయం చేయండి.
2. గ్రూప్ 2కు రెండు వేల ఉద్యోగాలు, గ్రూప్ 3 కి మూడు వేల ఉద్యోగాలు అదనంగా కలుపుతామని మీరు మాట ఇచ్చారు. ఆ మాటను నిలుపుకోవాలని కోరుతున్నాను.
3. పోటీ పరీక్షల మధ్య కాలవ్యవధి చాలా తక్కువ ఉండడం వల్ల అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. ఆందోళనకు గురవుతున్నారు. జూలై చివరి వరకు డీఎస్సీ పరీక్షలు ఉన్నాయి, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష ఉంది. ఏడు రోజుల గ్యాప్ మాత్రమే ఉన్నందున అభ్యర్థులు ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నామని అంటున్నారు. ఈ ఒత్తిడితోనే సంగీత అనే అమ్మాయి ఆత్మహత్య కూడా చేసుకుంది. కాబట్టి ఉద్యోగ నియామకాల పరీక్షల తేదీల మధ్య ఎక్కువ వ్యవధి ఉండేలా షెడ్యూల్ సవరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
4. ప్రభుత్వంలోకి వచ్చిన ఏడాదిలోగానే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. పత్రికల్లో మొదటి పేజీ ప్రకటనలు ఇచ్చారు. ఆరు నెలలు దాటినా ఆ దిశగా అడుగులు పడలేదు. వెంటనే రెండు లక్షల ఉద్యోగాలు గుర్తించి జాబ్ క్యాలెండర్ ప్రకటించి తదనుగుణంగా నోటిఫికేషన్లను జారీ చేయాలని, కోరుతున్నాను.
5. మీరు అధికారం లోకి రాగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు మొదటి క్యాబినెట్లోనే నిర్ణయం తీసుకుంటామని మీ మేనిఫెస్టోలో ఘనంగా ప్రకటించారు. 25 వేల టీచర్ పోస్టులలో డిఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని నిరుద్యోగులను నమ్మించారు. కానీ ఆచరణలో అందుకు భిన్నంగా 11 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి మోసం చేశారు. మీరు మేనిఫెస్టోలో చెప్పిన దానికి కట్టుబడి మొత్తం ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసే విధంగా మెగా డీఎస్సీ నిర్వహించాలని కోరుతున్నాను .
6, అదే విధంగా రాష్ట్రంలోని నిరుద్యోగులకు నెలకు 4000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించారు. మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఇప్పటివరకున్న బకాయీ మొత్తం సహా నిరుద్యోగ భృతిని నెలనెలా చెల్లించాలని కోరుతున్నాను.
7, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 46 రద్దు చేస్తామని నిరుద్యోగులను నమ్మించారు. కానీ అధికారంలోకి వచ్చినంక వారిని నట్టేటముంచి జి.వో 46ప్రకారమే నియామక ప్రక్రియ పూర్తిచేశారు. నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ మోసపూరిత వైఖరికి ఇది మరో నిదర్శనం. ప్రభుత్వం వెంటనే జీవో 46 ద్వారా ఏర్పడ్డ సమస్యలను పరిష్కరించి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరుతున్నాము.
నిరుద్యోగ యువతకు మీరు ఇచ్చిన వాగ్దానాలను గుర్తుచేసేందుకు, తద్వారా వారి ప్రయోజనాలను కాపాడేందుకు నేను రాసిన ఈ లేఖను సహృదయంతో అర్థం చేసుకొని వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరిస్తారని నమ్ముతున్నాను.