హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర జనాభాలో 10.8 శాతం ఉన్న ముస్లింలకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదని బీఆర్ఎస్ మైనార్టీ నేత వహీద్ అహ్మద్ ఏఐసీసీ ప్రెసిడెంట్ మలికార్జున ఖర్గేను ఒక ప్రకటనలో ప్రశ్నించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 18 నెలలైనా ఈ ప్రభుత్వం ముస్లింలకు చేసిందేమీ లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీని నిలదీసే సమయం వచ్చిందని, అందుకోసం ముస్లింలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. జూలై 4న ఖర్గే ఆధ్వర్యంలో జరిగే సమావేశం.. కేవలం స్థానిక ఎన్నికల స్టంట్ మాత్రమేనని విమర్శించారు.
వాయుసేన రన్‌వేని అమ్మేసిన తల్లీకొడుకు! ; 28 ఏండ్ల తర్వాత దర్యాప్తు మొదలు
ఫిరోజ్‌పూర్: మూడు కీలక యుద్ధాల్లో భారత వాయుసేనకు సేవలందించిన ఓ రన్‌వేను తల్లీకొడుకు తప్పుడు పత్రాలతో అక్రమంగా అమ్మేశారు. స్థానిక రెవెన్యూ అధికారుల సహకారంతో జరిగిన ఈ అక్రమ బాగోతంపై 28 ఏండ్ల తర్వాత పంజాబ్-హర్యానా హైకోర్ట్ జోక్యంతో తాజాగా దర్యాప్తు మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధం నాటి ఈ రన్ వేను భారత వైమానిక దళం 1962, 1965, 1971 యుద్ధాల్లో ఉపయోగించుకుంది. పాకిస్థాన్‌కు సమీపంగా ఉన్న ఈ రన్ వే బ్రిటిష్ పాలన కాలం నాటి నుంచి ఐఏఎఫ్ యాజమాన్యంలో ఉంది. అయితే ఉష అన్సల్, ఆమె కుమారుడు నవీన్ చంద్ 1997లో నకిలీ సేల్ డీడ్స్ సృష్టించి ఈ భూమిని వేరొకరికి అమ్మేశారు. ఈ తతంగంపై రిటైర్డ్ రెవెన్యూ అధికారి, ప్రజావేగు నిషాన్ సింగ్ ఎన్నో ఏండ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నా స్థానిక అధికారుల అవినీతి వల్ల ఫలితం దక్కలేదు. చివరగా ఆయన హైకోర్టులో ఇటీవల పిటిషన్ వేయడంతో ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని పంజాబ్ విజిలెన్స్ బ్యూరో చీఫ్ డైరెక్టర్‌ను ధర్మాసనం ఆదేశించింది.