సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టో ప్రకటన తర్వాత ప్రజల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ అమాంతం పెరిగింది. మ్యానిఫెస్టో జనరంజకంగా ఉండటం.. ప్రజలందరూ గులాబీ పార్టీవైపే మొగ్గుచూపుతుండటంతో కారు జోరందుకున్నది. కేసీఆర్‌కు ఎదురేలేదని ‘తెలంగాణ ఇంటెన్షన్’ సంస్థ సర్వేలో తేలింది.
హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టో ప్రకటన తర్వాత ప్రజల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ మరింత పెరిగింది. భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)ది సర్వజన మ్యానిఫెస్టో అని ‘తెలంగాణ ఇంటెన్షన్’ సంస్థ సర్వేలో తేలింది. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులపై ‘తెలంగాణ ఇంటెన్షన్’ వీక్లీ ఎలక్షన్ ట్రాకర్ రిపోర్టును ఆదివారం విడుదల చేసింది. మ్యానిఫెస్టో జనరంజకంగా, సకలజన ఆమోదయోగ్యంగా ఉన్నదని 67 శాతం మంది అభిప్రాయపడ్డారు. రూ.400లకే గ్యాస్ సిలిండర్, కేసీఆర్ బీమా, రైతుబంధు, ఆసరా పింఛన్ల సాయం పెంపు, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు వంటి అంశాలపై ప్రజల్లో విస్త్రృతంగా చర్చ జరుగుతున్నదని సర్వేలో వెల్లడైంది. గతంలో మాదిరిగా ప్రతి పేద కుటుంబానికి ఏదో ఒక రూపంలో లబ్ధి చేకూరేలా పకడ్బందీ ప్రణాళికతో మ్యానిఫెస్టో రూపొందించారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
మ్యానిఫెస్టో ఓటర్లను ఆకట్టుకునేలా ఉన్నదని 61 శాతం మంది చెప్పారు. ముఖ్యమంత్రిగా మూడోసారీ కేసీఆరే అధికారంలోకి రాబోతున్నారని, దీనిలో మ్యానిఫెస్టోది కీలక పాత్రని 44 శాతం మంది విశ్వాసం వ్యక్తం చేశారు. మరిన్ని సంక్షేమ పథకాలు ఉంటాయని ఆశించామని 24 శాతం మంది అభిప్రాయపడ్డారు. మ్యానిఫెస్టోతో సంబంధం లేకుండా గతంలో సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని, ఈసారి కూడా అదే జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. మ్యానిఫెస్టో అత్యద్భుతంగా ఉన్నదని, విపక్షాలు ఆ దరిదాపుల్లోకి కూడా రాలేవని 29 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఈ దెబ్బకు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు కనుమరుగయ్యాయని పేర్కొన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్కు తిరుగులేదని మరోసారి స్పష్టమైంది. ముచ్చటగా మూడోసారి కూడా కేసీఆరే ముఖ్యమంత్రి కాబోతున్నారని ‘తెలంగాణ ఇంటెన్షన్’ సర్వే తేల్చింది. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని 42 శాతం మంది అభిప్రాయపడితే, కాంగ్రెస్ వస్తుందని 32 శాతం, బీజేపీకి 10 శాతం మంది ఓటేశారు. హంగ్ వస్తుందని 9శాతం మంది పేర్కొన్నారు. ఏడుశాతం మంది మాత్రం ఏమీ చెప్పలేమని తెలిపారు. 55 మందితో తొలి జాబితా ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ మరింత పడిపోయిందని సర్వేలో తేలింది. గతంతో పోల్చితే కాంగ్రెస్‌కు ఒకశాతం మంది దూరమైనట్టు పేర్కొంది. రాహుల్‌గాంధీ ప్రజలను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారని, జన సమీకరణలో కాంగ్రెస్ విఫలమవుతున్నట్టు తేలింది. బీజేపీలో గత వారం రోజులుగా ఎలాంటి చలనమూ లేదని, దాని గురించి ప్రజల్లో ఆశించిన స్థాయిలో చర్చ జరగడం లేదని నివేదిక వివరించింది. సీఎం కేసీఆర్ బహిరంగ సభల తర్వాత బీఆర్ఎస్ గ్రాఫ్ మరింత పెరిగిందని సర్వే స్పష్టం చేసింది.
ఆమోదయోగ్యం 67%
ఓటర్లను ప్రభావితం చేసేలా ఉంది 64%
అధికారంలోకి రావడానికి మ్యానిఫెస్టో దోహదపడుతుంది 44%
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో అద్భుతం, ప్రతిపక్షాలు ఆ దరిదాపులో కూడా లేవు 29%