హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన బుధవారం మధ్యా హ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరుగనున్నది. బీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీ సభ్యులు పాల్గొనే ఈ సమావేశంలో జూన్ 2 నుంచి 21 రోజులపాటు నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలపై సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిపై తెలంగాణ ఆవిర్భావానికి ముందు.. తరువాత రాష్ట్రం సాధించిన ప్రగతిని ఆవిష్కరించనున్నారు.
ఈ నెల 13న జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో 21 రోజుల్లో నిర్వహించే కార్యక్రమా లపై సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులకు మార్గనిర్దేశనం చేశారు. ఈ ఉత్సవాల నిర్వహణలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులుగా పోషించాల్సిన పాత్రపై బుధవారం జరిగే సమావేశంలో దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. టీఆర్ఎస్ ఆవిర్భవించిన తరువాత కరీంనగర్ బహిరంగ సభ (సింహగర్జన రోజు-మే 17, 2001న) జరిగిన రోజు బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందిన తరువాత అదే రోజు తెలంగాణ భవన్లో పార్టీ ప్రజాప్రతినిధుల సమావేశం నిర్వహించడం విశేషం. దశాబ్ది ఉత్సవాల నిర్వహణతోపాటు ఇతర అంశాలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు హాజరకావాలని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశించారు.