హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ) : మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని స్పీకర్ సస్పెండ్ చేయడంపై బీఆర్ఎస్ భగ్గుమన్నది. ‘ప్రజా సమస్యలు లేవనెత్తితే సస్పెండ్ చేస్తారా?’ అంటూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెక్లెస్ రోడ్డులోని అతిపెద్ద బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం నిరసన చేపట్టారు. ‘ప్రభుత్వ నియంతృత్వ వైఖరి నశించాలి.. వియ్ వాంట్ జస్టిస్.. జై తెలంగాణ.. ప్రజాస్వామ్యం ఖూనీ.. హక్కులు కాపాడాలని కోరితే బహిష్కరణ వేటా? ప్రభుత్వ దమనకాండ నశించాలి.. ఇదేమి రాజ్యం? ఇదేమీ రాజ్యం? దొంగల రాజ్యం దోపిడి రాజ్యం.. ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపితే బహిష్కరిస్తరా?’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేయడంతో అంబేద్కర్ ప్రాంగణం, నెక్లెస్ రోడ్డు ప్రాంతమంతా హోరెత్తింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ‘పేరుకేమో ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకొంటూ.. ప్రజల తరఫున మాట్లాడే సభ్యుల గొంతు నొక్కడం ఏమిటి’ అని ప్రశ్నించారు. తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ విలువలకు పాతరేస్తూ నిరాధార ఆరోపణలతో బీఆర్ఎస్ శాసన సభ్యుడు జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయటం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. అనని మాటలు అన్నట్టు ఆరోపించి అబద్ధాల ఆధారంగానే జగదీశ్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేసిందని మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ఉంటే కాంట్రాక్టులు, కమీషన్లు, ఢిల్లీకి పంపుతున్న మూటల విషయాలు ప్రజలకు తెలుస్తాయనే భయంతోనే తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని దెప్పిపొడిచారు.
గవర్నర్ ప్రసంగంలో చెప్పిన పచ్చి అబద్ధాల మీద తమ ఎమ్మెల్యే మాట్లాడితే 6 నిమిషాల్లోనే ఉద్దేశపూర్వకంగా అటు మంత్రులు, ఎమ్మెల్యేలు రన్నింగ్ కామెంట్రీ చేస్తూ అవమానించారని, అయినా ఏమాత్రం సంయమనం కోల్పోకుండా రాష్ట్రంలో జరగని రుణమాఫీ, ఇంకా పడని రైతుబంధు, ఎండిపోతున్న పంటలపై మాట్లాడుతుంటే తట్టుకోలేక ప్రభుత్వం నిసిగ్గుగా జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేసిందని ఫైర్ అయ్యారు. ఏకపక్షంగా నియంతృత్వ పోకడతో రాష్ట్ర ప్రభుత్వం 5 గంటలు సభను వాయిదా వేసిందని చెప్పారు. ఢిల్లీలో ఉన్న సీఎం ఆదేశాలతోనే ఇదంతా జరిగిందని విమర్శించారు. ‘ఉరిశిక్ష పడిన వ్యక్తిని కూడా అఖరి కోరిక ఏమిటో అడుగుతారు.. కానీ మా నుంచి ఎలాంటి వివరణా అడగకుండా సస్పెండ్ చేయటం దారుణం’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. తామేమైనా పొరపాటుగా మాట్లాడితే టీవీ పెట్టి అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకోవాలని స్పీకర్‌కు, మంత్రి శ్రీధర్ బాబుకు సూచించినట్టు తెలిపారు.అదేం పాటించకుండా ఏకపక్షంగా కాంగ్రెస్ సభ్యులు చెప్పిందే మూడ్ ఆఫ్ హౌస్ అన్నట్టు తమ గొంతునొక్కారని పైర్ అయ్యారు. ప్రపంచంలో అతిపెద్దదైన 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని కేసీఆర్ ప్రభుత్వంలో సగర్వంగా ఏర్పాటు చేసుకుంటే ఆ అంబేద్కర్ ప్రాం గణం గేట్లు మూసేసి ఆ మహానుభావుడుని కూడా సంకెళ్లతో ఈ ప్రభుత్వం బంధించిందని నిప్పులు చెరిగారు. భవిష్యత్తులో కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోకతప్పదని, ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ పట్టపగలే ప్రజాస్యామ్యం గొంతుకోసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. పథకం ప్రకారమే జగదీశ్‌రెడ్డి సస్పెన్షన్ అని విమర్శించారు. ‘ప్రశ్నిస్తే కేసు లు, అక్రమ అరెస్టులు, సభలో ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే గొంతు నొక్కటం, సస్పెండ్ చేయటం ఇదేనా ప్రజా పాలన?’ అని నిలదీశారు. ముందు అసెంబ్లీ లాబీలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన హరీశ్, అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన నిరసనలోనూ మాట్లాడారు. దళిత స్పీకర్ అంటూ ఆయన స్థాయి, గౌరవాన్ని తగ్గించేలా కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని ఆక్షేపించారు. స్పీకర్‌గా ప్రసాద్ పేరును ప్రభుత్వం ప్రకటించగానే కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమంతా ఏకగీవ్రం గా ఎన్నికకు సహకరించామని గుర్తుచేశారు.
ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టి, సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి దళితజాతి గౌరవాన్ని పెంచింది కేసీఆరేనని వివరించారు. రేవంత్‌రెడ్డి డైరెక్షన్లో శ్రీధర్‌బాబు యాక్షన్ చేస్తున్నారని ఎద్దేవాచేశారు. పావుగంటకోసం సభను వాయిదా వేసి ఢిల్లీలోని రేవంత్‌రెడ్డితో మాట్లాడారని, తాము నిరసన కోసం అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్తే తాళం వేశారని ఫైర్ అయ్యారు. స్పీకర్‌ను జగదీశ్ అవమానించలేదని స్పష్టంచేశారు. ‘సభలో మీ అనే పదం వా డితే ఏకవాక్య సంబోధం ఎలా అవుతుంది?’ అని ప్రశ్నించారు. జగదీశ్‌రెడ్డి సభలో మాట్లాడుతూ సభ మీ ఒక్కరిది కాదని మాత్రమే అన్నారని, సభ కేవలం ప్రభుత్వపక్షమో, ప్రతిపక్షమో కాదని, సభ సభ్యుల అందరిదనే విశాలార్థంలో మా ట్లాడిన మాటను కూడా అన్‌పార్లమెంట్ పదమంటే ఎట్లా అని నిలదీశారు.
తన రాజకీయ జీవితంలో ఏనాడూ శాసనసభలో కించపరిచే వ్యాఖ్యలు చే యలేదని జగదీశ్‌రెడ్డి తెలిపారు. స్పీకర్ అధికారాలు, విధులు తనకు తెలుసునని చెప్పారు. ఎక్కడా స్పీకర్ గౌరవానికి భంగం కలిగించలేదని, ఇది కేవలం ప్రభుత్వ కుట్ర అని, తన సస్పెన్షన్‌కు స్పీకర్ సమ్మతిస్తారనుకోలేదని వాపోయారు. ఎండుతున్న పంటలు, ప్రజల సమస్యలు, రైతుల బాధలు, వివిధ వర్గాల ప్రజలు ఎలా మోసపోయామని బాధపడుతున్నారో వివరాలను స్పీకర్ దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశానన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు తమకు ఉన్నదని చెప్పారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను ప్రాధేయపడ్డానని, ఈ సభ అందరిదని.. కాం గ్రెస్ వాళ్లదే కాదని, అందరినీ నియంత్రించాలని మాత్రమే స్పీకర్‌కు గుర్తుచేశానని తెలిపారు. స్పీకర్ స్థానానికి కులం, మతం ఉంటుందా? అని ప్ర శ్నించారు. నిరసన కార్యక్రమంలో శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్సీ వాణీ దేవి, బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇం ద్రారెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, కేపీ వివేకానంద పాల్గొన్నారు.