హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని బీఆర్ఎస్, వామపక్ష, టీజేఎస్ డిమాండ్ చేశాయి. ‘సర్’ ప్రక్రియను వెంటనే నిలిపేయాలని కోరాయి. తొలగించిన ఓట్లలో అర్హులైన వారి ఓట్లను తిరిగి చేర్చాలని సూచించాయి. బుధవారం ఆయా పార్టీల నాయకులు ట్యాంక్ బండ్ అంబేదర్ విగ్రహం నుంచి బీఆర్కే భవన్ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఓట్ల దొంగ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. బీఆర్కే భవన్ వద్దకు చేరుకున్న నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లేందుకు నాయకులు యత్నించగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ మాట్లాడుతూ ఈసీ పారదర్శకంగా ‘సర్’ ప్రక్రియను నిర్వహించాలని చెప్పారు. అర్హులైనవారి ఓట్లను తిరిగి చేర్చాలని డిమాండ్ చేశారు. జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని కోరుతూ గురువారం అన్ని జిల్లాల్లో చేపట్టే నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని కోరారు. నిరసన అనంతరం జాయింట్ సీఈవో వెంకట్రావును కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, బీఆర్ఎస్, సీపీఎం, టీజేఎస్ నేతలు పాల్గొన్నారు.