హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ నాయకులపై అసత్య ప్రచారాలు చేస్తున్న మహాటీవీకి పార్టీ లీగల్ నోటీసులు పంపించింది. ప్రభుత్వంలోని కొందరు పెద్దలతో చేతులు కలిపి బీఆర్ఎస్ నేతలపైన అడ్డగోలుగా దుష్ప్రచారం చేయడంతోనే నోటీసులు ఇస్తున్నట్టు తెలిపింది. కొండా సురేఖపై రూ.100 కోట్ల పరువు నష్టం కేసు వేసినట్టుగానే మహాటీవీపై చట్టపరమైన చర్యలు కోరుతామని పేర్కొన్నది.
బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ మేరకు న్యాయవాదుల బృందం నోటీసులు పంపించింది. వ్యక్తిగత ఎజెండాలకు వేదికగా కాకుండా సమాజ ప్రయోజనాల కోసం జర్నలిజాన్ని ఉపయోగించాలని మహాటీవీకి పార్టీ విజ్ఞప్తి చేసింది. ఫోన్‌ట్యాపింగ్ అంశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై దురుద్దేశపూర్వకంగా, అడ్డగోలుగా ఫేక్ వార్తలు ప్రసారం చేసినట్టు తెలిపింది. జర్నలిజం ముసుగులో మహాటీవీ మేనేజ్మెంట్ వ్యక్తిగతంగా విషం చిమ్ముతుండటంతో నోటీసులు ఇచ్చినట్టు పేర్కొన్నది.
‘ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొన్ని రోజుల నుంచి తప్పుడు థంబ్‌నెయిల్స్‌తో మహాటీవీ వార్తలు ప్రసారం చేస్తున్నది. ఈ విషయంలో పలుమార్లు పార్టీ విజ్ఞప్తులు చేసినా మహాటీవీ ఎడిటోరియల్ విధానంలో ఎలాంటి మార్పు రాలేదు. బీఆర్ఎస్ నాయకులకు చెడ్డపేరు తీసుకొచ్చేందుకు రూపొందించిన అసత్య కథనాలను ప్రసారం చేయడాన్ని మహాటీవీ ఆపలేదు. అసత్య ఆరోపణలను మహాటీవీ చానెల్లో ప్రచారం చేయడాన్ని కొనసాగించింది. ‘తమ్మినేని తమ్ముడు’ వంటి పాత్రలతో బీఆర్ఎస్ నాయకులపై వ్యక్తిగత దూషణలు, అవమానకరమైన కథనాలను మహాటీవీ ప్రసారం చేసింది’ అని లీగల్ నోటీసుల్లో పేర్కొన్నది.
బీఆర్ఎస్ నాయకులపై గతంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలు, చట్టవ్యతిరేక ప్రసారాలు చేసిన యూట్యూబ్ చానళ్లకు బీఆర్ఎస్ నోటీసులు ఇవ్వగా, కొన్నింటిలో కోర్టులు గట్టి హెచ్చరికలు జారీచేసినట్టు బీఆర్ఎస్ గుర్తుచేసింది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వంలోని కొందరు నాయకులతో చేతులు కలిపిన మహాటీవీ బీఆర్ఎస్పై, నేతల పై దుష్ప్రచారం చేయడంపై స్పందిస్తూ, శనివారం లీగల్ నోటీసులు పంపినట్టు పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది.