మెదక్ అర్బన్, జూన్ 30 : రైతులు పండించిన జొన్నలు కొనకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటావార్పు చేపట్టి రైతుల తరపున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి హెచ్చరించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతెపల్లి, కాట్రియాల, పర్వతాపూర్, కిషన్‌తండా, జామ్లాతండాకు చెంది రైతులు జొన్నల కొనుగోలును వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మెదక్ కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ఎంతో కష్టపడి పండించిన జొన్నలను ప్రభుత్వం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ఇప్పటికే కొనుగోలు చేసిన జొన్నలను మట్టిపెళ్లలు ఉన్నాయనే సాకుతో తిరిగి రైతులకే అప్పగించడం సరికాదన్నారు. ఈ సమస్యపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుతో ఫోన్లో మాట్లాడినట్టు తెలిపారు. జొన్నల కొనుగోలుపై అధికారులు స్పష్టమైన హామీ ఇచ్చేవరకు కదిలే ప్రసక్తేలేదని స్పష్టంచేశారు. మార్క్‌ఫెడ్ డీఎం బాలకృష్ణ, డీఆర్వో అంబదాస్ వచ్చి జొన్నలు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.