హైదరాబాద్, సెప్టెంబర్ 30(నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు వెళ్లినట్టుగా కాకుండా, ఒక ప్రాంతంపై సైనిక దండయాత్ర చేసినట్టుగా ఉన్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సిరిసిల్లలో బీఆర్ఎస్ ముఖ్య నేతలను అక్రమంగా నిర్బంధించి, పోలీసుల కవాతు మధ్య సభ నిర్వహించడం కాంగ్రెస్ పిరికితనానికి నిదర్శనమని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులను అణచివేసినట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ నీళ్లను కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్‌కు తరలిస్తున్నా, పొరుగున ఉన్న కర్ణాటకలోని కాంగ్రెస్ సరార్ ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచేందుకు రూ.లక్ష కోట్లు బడ్జెట్లో కేటాయించినా కాంగ్రెస్ మంత్రులు తమ స్వార్థ దందాల్లో మునిగి నోరు మెదపడం లేదని ఆరోపించారు. సింగరేణి బొగ్గును ఎకడికి తరలిస్తున్నారో సమాధానం చెప్పాలని, దమ్ముంటే పోలీసులు లేకుండా సభలు పెట్టుకోవాలని, అశోక్‌నగర్‌కు వెళ్లి నిరుద్యోగుల సమస్యలు వినాలని శ్రీనివాస్‌గౌడ్ సవాల్ విసిరారు.
గృహనిర్బంధం చేసి సభ పెట్టడం సిగ్గుచేటు: పట్నం

Kodanal Patnam Narender Red
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ముఖ్య నాయకులను గృహనిర్బంధం చేసి సభలు పెట్టుకోవడం సిగ్గుచేటని, సొంత నియోజకవర్గమైన కొడంగల్‌కు కూడా ఏమీ చేయలేని వ్యక్తి, సిరిసిల్ల ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో రంగనాథ్ ఆధ్వర్యంలో హైడ్రా కూల్చివేతలు సాగుతుంటే, కొడంగల్‌లో రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి పేరుతో ప్రత్యేక హైడ్రా నడుస్తున్నదని ఆరోపించారు. లగచర్ల ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట బలవంతంగా గిరిజనుల భూములు లాకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ హయాంలో కొడంగల్ అభివృద్ధికి రూ.5వేల కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. కేటీఆర్, హరీశ్‌రావు నాయకత్వంలో సిరిసిల్ల, సిద్దిపేట ఏ స్థాయిలో ప్రగతి సాధించాయో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చూసి నేర్చుకోవాలని హితవు పలికారు. కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిరుమళ్ల రాకేశ్‌కుమార్ మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి సిరిసిల్లకు వెళ్లింది ప్రజాసమస్యల పరిషారానికా.. లంకెబిందెల కోసమా.. అని ఎద్దేవా చేశారు.