RS Praveen Kumar | రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. రాష్ట్రంలోని రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ రేవంత్ రెడ్డి ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల హక్కులను కాపాడాల్సిన ముఖ్యమంత్రే వాటిని హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డే బాధితుడు, ఫిర్యాదుదారుడు, పోలీసాఫీసర్, ఇన్వెస్టిగేటర్, మెజిస్ట్రేట్, జైలు వార్డెన్, సూపరింటెండెంట్, దళారి అన్ని పాత్రలు ఆయనే పోషిస్తున్నాడని ఎద్దేవా చేశారు.హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడున్నర కోట్ల మంది ప్రజలు సంతోషంగా ఉన్నారంట.. రేవంత్ రెడ్డి ఒక్కడే బాధితుడంట అని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి తీరును బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ లోపల, బయట గణాంకాలతో సహా ఎండగట్టిందని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా పోరాడటాన్ని రేవంత్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. సోషల్‌మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిని సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. మార్చి 15, 16వ తేదీల్లో 15 కేసులు పెట్టారని అన్నారు. ట్విట్టర్(ఎక్స్)లో రీట్వీట్ చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై సెక్షన్ 67 ఐటీ యాక్ట్ కింద కేసులు పెడుతున్నారని తెలిపారు. సెక్షన్ 67 ఐటీ యాక్ట్ అనేది ఎవరినైనా అశ్లీలంగా అగౌరవపరిస్తే పెడతారని.. కానీ బీఆర్ఎస్ కార్యకర్తల మీద మాత్రం విచ్చలవిడిగా ఈ యాక్ట్‌తో కేసులు పెడుతున్నారని తెలిపారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డే బాధితుడు, ఫిర్యాదు దారుడు, పోలీస్, ఇన్వెస్టిగేటర్, క్లూస్ టీమ్, మేజిస్ట్రేట్, జైల్ వార్డెన్, సూపరిండెంటెంట్.. అన్ని ఆయనే చేస్తున్నాడు
తెలంగాణలో అందరూ సంతోషంగా ఉన్నారట ఒక రేవంత్ రెడ్డినే బాధితుడట – ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ pic.twitter.com/QaZf2t0xkZ
— Telugu Scribe (@TeluguScribe) March 29, 2025
కేసీఆర్ హయాంలో 2023లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పడిందని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. సైబర్ నేరగాళ్ల నుంచి ప్రజలను కాపాడాలనే మంచి ఉద్దేశంతో ఆ బ్యూరోను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. గొప్ప దార్శనికతతో కేసీఆర్ దాన్ని స్థాపించారని.. కానీ రేవంత్ రెడ్డి మాత్రం హోం మంత్రిగా ఆ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. డిజిటల్ మోసాల నుంచి ప్రజలను రక్షించాల్సిన ఆ బ్యూరోను బీఆర్ఎస్ సోషల్‌మీడియాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కొందరు రేవంత్ రెడ్డి తొత్తులుగా పనిచేస్తూ, కాపీ పేస్ట్ ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు.