భువనగిరి కలెక్టరేట్, అక్టోబర్ 22 : రామన్నపేటలో అదానీ గ్రూప్ ఏర్పాటు చేయతలపెట్టిన కాలుష్య కారక అంబుజా సిమెంట్ పరిశ్రమను ఎన్ని అడ్డంకులు వచ్చినా అడ్డుకుంటామని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హెచ్చరించారు. అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించిన అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చిరుమర్తి మాట్లాడుతూ పచ్చటి పంట భూముల మధ్య అంబుజా సిమెంట్ కర్మాగారం నెలకొల్పి పల్లెలను కాలుష్య కోరల్లోకి నెట్టే కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం లోపాయికారి ఒప్పందాలతో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు సహకరిస్తున్నదని ఆరోపించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పరిశ్రమలను నెలకొల్పుతామంటే సహించేది లేదని హెచ్చరించారు.