వికారాబాద్, అక్టోబర్ 15, (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా దామగుండంలో వీఎల్ఎఫ్ రాడార్ కేంద్రం శంకుస్థాపన సందర్భంగా బీఆర్ఎస్ నేతలను, దామగుండం అడవి పరిరక్షణ జేఏసీ సభ్యులను, ప్రకృతి ప్రేమికులను ఎక్కడిక్కడ నిర్బంధించారు. రాడార్ కేంద్రం శంకుస్థాపన సందర్భంగా నిరసనలు జరగకుండా సోమవారం రాత్రి నుంచే ముందస్తు అరెస్ట్‌లు చేశారు.
అరెస్ట్ చేసిన దామగుండం అడవి పరిరక్షణ జేఏసీ సభ్యులతోపాటు బీఆర్ఎస్, సీపీఎం నేతలను కుల్కచర్ల, పరిగి, వికారాబాద్, కోట్‌పల్లి పోలీస్స్టేషన్లకు తరలించారు. అక్రమ అరెస్ట్‌లతో పోరాటాన్ని ఆపలేరని, సేవ్ దామగుండం అంటూ నల్ల బ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు.
దామగుండం అడవి పరిరక్షణ జేఏసీ చైర్మెన్ దేవనోనిగూడెం వెంకటయ్య, జేఏసీ కో-ఆర్డినేటర్లు రామన్న మాదిగ, సునంద బుగ్గన్న యాదవ్, ఎరన్‌పల్లి శ్రీనివాస్, బీఆర్ఎస్ నేతలు ప్రవీణ్‌రెడ్డి, మల్లేశం, శేరి రాంరెడ్డి, రాజు, రవికుమార్, టీజేఏసీ చైర్మన్ ముకుంద నాగేశ్వర్, న్యూడెమోక్రసీ మల్లేశం, సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్, పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి గీత, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వై.మహేందర్ ప్రజాసంఘాల నాయకులు, తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు.
అదేవిధంగా మోమిన్‌పేట్ మండలంలో అంత్యక్రియలకు వెళ్తున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ను మోమిన్‌పేట్ మండలం చీమలదరిలో పోలీసులు అదుపులోకి తీసుకుని మోమిన్‌పేట్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు రాడార్ కేంద్రం శంకుస్థాపన సందర్భంగా దామగుండం పరిసర గ్రామాలు, తండాల ప్రజలను గృహ నిర్బంధం చేశారు. శంకుస్థాపన కార్యక్రమం ముగిసేవరకు కనీస అవసరాల కోసం కూడా బయటకు రానివ్వకుండా పోలీసులు భయబ్రాంతులకు గురిచేశారు.
మరోవైపు దామగుండం అడవిని నాశనం చేసి రాడార్ కేంద్రం ఏర్పాటును నిరసిస్తూ వికారాబాద్, తాండూర్లలో బీఆర్ఎస్ నేతలు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తంచేశారు. బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్‌పటేల్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్‌కుమార్, కౌన్సిలర్ కిరణ్ పటేల్, బీఆర్ఎస్వీ జిల్లా అధికార ప్రతినిధి దత్తాత్రేయ రావు, నాయకులు సురేష్‌గౌడ్, కేదార్నాథ్, ప్రభాకర్‌రెడ్డి, రంజిత్, మణికంఠ తదితరులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
ఇది నిర్బంధ పాలన : మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్
రాడార్ కేంద్రం శంకుస్థాపన సందర్భంగా బీఆర్ఎస్ నేతలను, దామగుండం అడవి పరిరక్షణ సమితి సభ్యులను, ప్రజలను అరెస్ట్, గృహనిర్బంధం చేయడంపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది ప్రజాపాలన కాదని, నిర్బంధ పాలన అని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు మానుకోవాలని, లేదంటే ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
దామగుండంలో వద్దే వద్దు
జీవవైవిద్యానికి మారు పేరుగా ఉన్న దామగుండంలో రాడార్ కేంద్రం వద్దే వద్దు. జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల నిర్బంధం, అరెస్ట్‌లు సరికాదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గుండారాజ్యాన్ని తలపించేలా పరిపాలన సాగుతుంది. ఇక్కడ రాడార్ కేంద్రం ఏర్పాటుకు ప్రకృతి కూడా సహకరించలేదు. భారీ వర్షంతో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, సీఎం రేవంత్ రోడ్డు మార్గాన రావడం ఇందుకు నిదర్శనం.
– శుభప్రద్‌పటేల్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు