Lagacharla | సంగారెడ్డి, నవంబర్ 15(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా కందిలోని సెంట్రల్ జైలుకు శుక్రవారం వచ్చిన కేటీఆర్‌ను చూసి లగచర్ల రైతులు ఉద్వేగానికి గురయ్యారు. ఆయన చేతులు పట్టుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కాంగ్రెస్ కుట్రను కేటీఆర్ ఎదుట ఏకరువు పెట్టుకున్నారు. అక్రమంగా జైలులో నిర్బంధించిన తమను ఆదుకోవాలని, తమ కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు. జైలులో ములాఖత్‌లో లగచర్ల బాధిత రైతులను కలిసిన కేటీఆర్ ఎవరూ అధైర్య పడవ్దదని, కేసీఆర్, బీఆర్ఎస్ మీ వెన్నంటి ఉం టుందని ధైర్యం చెప్పారు. జైలులో ఉన్న ప్రతి ఒక్కరినీ బయటకు తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని చెప్పడమే కాదు వెంటనే చేతల్లోనూ చూపించారు. బాధితుల్లోని ఒకరి భార్య అయిన జ్యోతి గర్భిణి అని తెలుసుకుని శనివారం ఆమెను దవాఖానకు తీసుకెళ్లి అవసరమైన సహాయం అందించాలని మాజీ మం త్రి సత్యవతి రాథోడ్‌కు సూచించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌లోని లగచర్ల ఘటనలో అరెస్టు అయిన 16 మందిని పోలీసులు గురువారం రాత్రి సంగారెడ్డి జిల్లా కందిలోని సెంట్రల్ జైలుకు తరలించారు.
కేటీఆర్ శుక్రవారం భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్ నుంచి సంగారెడ్డి వచ్చారు. అక్కడ అడుగడుగునా బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, శ్రేణులు, ప్రజ లు ఘనస్వాగతం పలికారు. ములాఖత్‌లో వచ్చిన రైతులతో కేటీఆర్ ముఖాముఖిగా మాట్లాడారు. ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలుకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. లగచర్ల ఘటన, కేసుల నమోదు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా 16 మంది బాధితులు కేటీఆర్‌ను చూసి ఉద్వేగానికి గురయ్యారు. తమపై కాంగ్రెస్ సర్కార్ అక్రమ కేసులు బనాయించి జైలు పాలు చేసిందని కన్నీరు పెట్టుకున్నారు. రాఘేవంద్రయాదవ్ అనే ప్రభుత్వ ఉద్యోగి కేటీఆర్‌తో మాట్లాడుతూ.. తాను పంచాయతీ సెక్రటరీనని, వేరే మండలంలో కులగణనలో పాల్గొని రాత్రికి ఇంటికి రాగా, పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారని, ఉద్యోగం పోతే తన కుటుంబం ఇబ్బందులకు గురవుతుందని, ఉద్యోగం పోకుండా చూడాలని కేటీఆర్‌ను కోరారు.
వనపర్తిలో ఐటీఐ చదవుతున్న తాను గ్రామంలో ఉన్న తల్లిదండ్రుల యోగక్షేమాలు తెలుసుకునేందుకు ఇంటికొస్తే, పోలీసులు తనపైనా అక్రమంగా కేసులు బనాయించి జైలుకు పంపినట్లు శివకుమార్ అనే విద్యార్థి కేటీఆర్ ఎదుట కన్నీరు పెట్టుకున్నాడు. అందరూ ధైర్యంగా ఉండాలని, బెయిల్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తామని కేటీఆర్ వారికి ధైర్యం చెప్పారు. జైలులో ఉన్న ప్రతి ఒక్కరినీ బయటకు తీసుకురావడంతో పాటు మీ కుటుంబాలకు కేసీఆర్, బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని భరోసా ఇవ్వడంతో బాధితులు సంతోషం వ్యక్తంచేశారు. అంతకుముందు భారీ కాన్వాయ్‌తో హైదరాబాద్ నుంచి సంగారెడ్డి వరకు కేటీఆర్‌కు బీఆర్ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. కంది ప్రధాన రహదారిపై పోలీసులు బారికేడ్లు వేసి జైలు సమీపంలోకి ఎవరూ రాకుండా అడ్డుకోవడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జైలు గేటు వద్ద లగచర్ల రైతుల అరెస్టులకు వత్యిరేకంగా నిరసనకు దిగారు. కాంగ్రెస్ సర్కార్, సీఎం రేవంత్‌రెడ్డి డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు.